టిబెటన్ల పవిత్ర ఆధ్యాత్మిక గురువు దలైలామా రిటైర్ కాబోతున్నారని ధర్మశాలలోని ప్రవాస టిబెట్ పార్లమెంట్ స్పీకర్ కర్మా చోపెల్ తెలిపారు. నవంబర్‌లో టిబెట్ పార్లమెంట్ ప్రత్యేక సాధారణ సమావేశం గురించి దలైలామా తమతో మాట్లాడారని చెప్పారు.
గతంలో తాను సగం రిటైర్ అయ్యానని దలైలామా చెప్పేవారని అయితే ఇప్పుడు మాత్రం తాను దాదాపుగా సంపూర్ణ రిటైర్‌మెంట్ దశకు వచ్చేశానని అంటున్నట్లుగా కర్మా చెప్పారు. ఆయన ఇటీవల కాలంలో విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. విద్య అంటే సాధారణ విద్య కాదని, సకల విద్యారంగాల్లోనూ టిబెటన్ ప్రజలు తప్పనిసరిగా ప్రావీణ్యం సంపాదించాలని దలైలామా కోరుకుంటున్నారని కర్మా చోపెల్ పేర్కొన్నారు.
ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత దలైలామా టిబెటన్ చిల్డ్రన్ విలేజ్ స్కూల్ 48వ వార్షికోత్సవాల సందర్భంగా శనివారం దర్శనమిచ్చారు. ఆస్పత్రినుంచి తిరిగొచ్చాక ఆయన మొదటిసారిగా దర్శనం ఇవ్వడంతో టిసివి విద్యార్థులకు ఇదొక గొప్ప సుదినమని ఓ స్కూలు విద్యార్థి చెప్పాడు.
ఈలోగా, నవంబర్‌లో ప్రవాస టిబెటన్ల ప్రత్యేక సమావేశానికి దలైలామా పిలుపిచ్చారు. టిబెట్‌లో ఈ సంవత్సరం రాజకీయ అశాంతి, టిబెటన్ ఉద్యమం భవిష్యత్తు వంటి విషయాలను చర్చించడానికి ఆయన ఈ ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చారు.