భారత్‌కు పాకిస్థాన్ శత్రుదేశం కాదని జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. అయితే ఆ దేశంలోని కొన్ని వ్యతిరేక శక్తులు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. శుక్రవారం రాత్రి ముంబైలో జరిగిన ఒక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. తమ భూభాగం నుంచి తీవ్రవాద కార్యకలాపాలు సాగనివ్వబోమని పాక్ గతంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందని, ఉగ్రవాదం నిర్మూలనకు భారత్‌కు పూర్తి సహకారం అందిస్తుందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు.
అంతేకాక భారత్‌కు పాకిస్థాన్ శత్రువు కాదనే విషయాన్ని తాను భావిస్తున్నా. ఆ దేశంలోని కొన్ని శక్తులు ఇరు దేశాల మధ్య సత్‌సంబంధాలు నెలకొనడాన్ని సహించలేక పోతున్నాయన్నారు. ముంబై మారణహోమం అనంతరం పాకిస్థాన్ స్పందన, చేపట్టిన చర్యలపై ఒమర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాలపై పాక్ స్పందన సంతృప్తికరంగా లేదని స్పష్టం చేశారు.
చేపట్టాల్సిన అనేక చర్యలు మిగిలివున్నాయి. బంతి పాక్ కోర్టులోనే ఉంది. ముంబై దాడులకు సంబంధించి పూర్తి ఆధారాలను పాక్‌కు అందజేసినట్టు ప్రపంచ దేశాలు కూడా చెపుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్ డిమాండ్లకు పాక్ స్పందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. భారత్‌తో సత్‌సంబంధాలు నెలకొల్పేందుకు పాకిస్థాన్ తీవ్రంగా శ్రమించాల్సి వుందని ఒమర్ అభిప్రాయపడ్డారు.