"మహా" క్యాబినేట్‌ను విస్తరించిన సీఎం పృథ్వీరాజ్ చవాన్!

ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంతో రాజీనామా చేసిన అశోక్ చవాన్ స్థానంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన పృథ్వీరాజ్ చవాన్, తన మంత్రి వర్గాన్ని శుక్రవారం విస్తరించారు. తన క్యాబినెట్‌లో 29 కొత్త మంత్రులకు స్థానం కల్పించారు. ఈ క్యాబినెట్‌లో కాంగ్రెస్ సీనియర్ నేతలు నారాయణ్ రాణే, పతంగ్‌రావ్ కదంలు కూడా దర్శనమివ్వనున్నారు.

మహారాష్ట్ర గవర్నర్ కె. శంకరనారాయణన్ ఆధ్వర్యంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది. చవాన్ నూతన మంత్రివర్గంలో 19 మంది కాంగ్రెస్, 10 మంది ఎన్సీపీ సభ్యులకు స్థానం కల్పించారు. కాగా.. ఇది పృథ్వీరాజ్ చవాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అనంతరం జరిగిన రెండవ ప్రమాణస్వీకార మహోత్సవం. గత వారం క్రితం ముఖ్యమంత్రిగా పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌లు ప్రమాణస్వీకారం చేశారు.

నూతన మంత్రుల తుదిజాబితాను రూపొందించడంలో జాప్యం జరగడంతో గురువారం జరగాల్సిన మంత్రి వర్గ విస్తరణ నేటికి వాయిదా పడింది. మంత్రుల తుది జాబితాపై చర్చించేందుకు బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాతో సమావేశమైన చవాన్ కాంగ్రెస్, ఎన్సీపీలకు ఇదివరకు కేటాయించిన నిష్పత్తి (23:20)లో తాజా విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదే అంశంపై ఎన్సీపీ సీనియర్ నేత, కేంద్ర పౌర విమానయానశాఖామంత్రి ప్రఫుల్ పటేల్ కూడా మంత్రి పదవుల నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండబోదని తేల్చి చెప్పారు. ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణల నేపథ్యంలో అశోక్ చవాన్ రాజీనామా అనంతరం నవంబర్ 11న పృథ్వీరాజ్ చవాన్ మాహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవీబాధ్యతలు చేపట్టారు. కాగా.. ఈయన మహారాష్ట్రకు 22వ ముఖ్యమంత్రి కావడం విశేషం.

వెబ్దునియా పై చదవండి