కర్ణాటక అసెంబ్లీ రద్దుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్!

ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ భూ కుంభకోణానికి పాల్పడిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వాన్ని తక్షణం బర్తరఫ్ చేయాలని కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్‌కు ఒక వినతి పత్రం కూడా సమర్పించారు.

ప్రభుత్వ భూములను తన కుటుంబ సభ్యులకు కేటాయించిన వివాదంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప చిక్కుకున్న విషయం తెల్సిందే. ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ అధిష్టానం సీరియస్‌గా పరిగణించి, యడ్యూరప్పకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసింది.

ఇదే అదునుగా భావించిన ఆ రాష్ట్ర విపక్ష సభ్యులు కర్ణాటకలోని భాజపా సర్కారును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై శాసనసభ ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ప్రజల మద్దతును రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని, అందువల్ల తక్షణం ఈ ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేశారు. యడ్యూరప్ప సర్కారులోని మంత్రులందరూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

యడ్యూరప్పకు ఉద్వాసన పలకడంలో భాజపా అధినాయకత్వం విఫలమైతే తాము రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగ పాలన పూర్తిగా పడిపోయిందన్నారు. భూముల కేటాయింపు కుంభకోణంలో చిక్కుకున్న యడ్యూరప్ప తీవ్రమైన ఒత్తిడికి లోనై పాలనపై దృష్టిసారించలేక పోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి