అధిష్టాన ఆదేశాలను శిరసావహిస్తా: కర్ణాటక ముఖ్యమంత్రి

తన వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం తీసుకునే నిర్ణయాన్ని తాను శిరసావహిస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప ప్రకటించారు. తనను తొలగించే వ్యవహారంపై పార్టీ జాతీయ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానన్నారు. వారి ఆదేశాలను శిరసావహించనున్నట్టు ఆయన తెలిపారు.

కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములను పంచిపెట్టి పీకల్లోతు వివాదంలో చిక్కున్న యడ్యూరప్పను తొలగించే అంశంపై కమలనాథులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ అంశంపై అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన యడ్యూరప్ప.. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ రోజు తమ పార్టీకి చెందిన జాతీయ నేతలందరితో సమావేశమై కర్ణాటక రాష్ట్ర పరిస్థితులను వివరించనున్నట్టు తెలిపారు.

మరో నెలలో జిల్లా పంచాయతీ ఎన్నికలను ఎదుర్కోనున్నామని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అలాంటపుడు ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు వైదొలగాలని ప్రశ్నించారు. అయినప్పటికీ.. పార్టీ నేతలతో సమావేశమవుతానని, వారు చెప్పినట్టు నడుచుకుంటానన్నారు. అయితే, ఇప్పటి వరకు తనను ఎవరూ రాజీనామా చేయమని కోరలేదన్నారు.

వెబ్దునియా పై చదవండి