స్పెక్ట్రమ్ వ్యవహారం: సుప్రీం నుంచి ప్రధానమంత్రికి ఊరట!
స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు నుంచి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఊరట లభించింది. ఈ కుంభకోణానికి సంబంధించి కేంద్ర టెలికామ్ మాజీ మంత్రి ఏ.రాజాను విచారించేందుకు అనుమతి ఇవ్వడంలో తీవ్ర జాప్యం నెలకొంది. దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని విచారించే నిమిత్తం అనుమతి ఇచ్చేందుకు 17 నెలల సమయం కావాలా అంటూ ప్రధానమంత్రి కార్యాలయంపై మండిపడింది.
ఈ అంశంపై ప్రధానమంత్రి తరపున అపెక్స్ కోర్టులో అడ్వకేట్ జనరలో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. అఫిడవిట్‌ను పరిశీలించిన కోర్టు... ఈ అంశంలో ప్రధానమంత్రి కార్యాలయానికి ఎలాంటి సంబంధంలేదని పేర్కొంది. కేంద్ర న్యాయశాఖ జాప్యం చేసిందని, అందువల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కోర్టు పేర్కొంది. కోర్టు తాజా వ్యాఖ్యలు ప్రధానికి ఎంతో ఊరట కలిగించేలా ఉన్నాయి.
2జి స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపు వ్యవహారంలో 1.75 లక్షల కోట్ల రూపాయల మేరకు అవినీతి చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ మొత్తం కేంద్ర ఖజానాకు చేరకుండా అప్పటి టెలికామ్ శాఖామంత్రి ఏ.రాజా తన అధికారాలను వినియోగించి స్వాహా చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై ఆయన వద్ద విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జనతా పార్టీ అధినేత డాక్టర్ సుబ్రమణ్య స్వామి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై కేంద్రానికి సుప్రీం నోటుసులు జారీ చేసినప్పటికీ కేంద్రం స్పందించని విషయం తెల్సిందే.