స్పెక్ట్రమ్‌పై ఎంపీల బృందం విచారణ చేపట్టాలి: మమత బెనర్జీ

వివాదాస్పద 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులపై ఎంపీల బృందం విచారణ చేపట్టాలని కేంద్ర రైల్వేమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులపై పార్లమెంటులో చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉందని, దీంతో వాస్తవాలు వెల్లడవుతాయని మమతా పేర్కొన్నారు.

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలోని నిజానిజాలు బయటకు రావాలంటే తప్పనిసరిగా పార్లమెంట్‌లో చర్చ జరగాలని మమతా అన్నారు. కాగా.. 2జి స్కామ్‌పై యుపిఏ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపిన మమత ఈ అంశంపై లోక్‌సభలో చర్చ జరిగినా ఫర్వాలేదని ఈ నెల 20న స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు స్పెక్ట్రమ్ కుంభకోణంపై బుధవారం పార్లమెంట్ దద్ధరిల్లింది. 2-జి స్పెక్ట్రమ్ కేటాయింలపై దర్యాప్తుకు సంయుక్త పార్లమెంటు కమిటీ (జెపిసి)ని ఏర్పాటు చేయాలని విపక్షాలు పట్టుసడలించకపోవడంతో పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి.

బుధవారం పార్లమెంట్ సమావేశమైన కొద్ది సేపటికే జేపీసీ ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలు బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.

వెబ్దునియా పై చదవండి