టెలిఫోన్ ట్యాపింగ్‌ను సమర్థించిన ప్రధాని మన్మోహన్ సింగ్

బుధవారం, 15 డిశెంబరు 2010 (09:55 IST)
దేశ ప్రధాని, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ టెలిఫోన్ ట్యాపింగ్‌ను సమర్థించారు. పన్నుల ఎగవేత, భారత్ తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కుట్రలను చేధించేందుకు ఇలాంటి అధికారాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదేసమయంలో ట్యాప్ చేసిన ఫోన్ సంభాషణలు బయటకు పొక్కకుండా నియంత్రించడానికి, అలాగే దీన్ని దుర్వినియోగం చేయకుండా చూడడానికి గట్టి నియంత్రణ అవసరమన్నారు.

ఫోన్ ట్యాపింగ్‌పై పలు కార్పొరేట్ అధిపతులతో పాటు రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో ప్రధాని చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ప్రభుత్వ న్యాయ వ్యవస్థల పరిధి దాటి ప్రజలకు ఈ సంభాషణలు చేరకుండా నిరోధించడానికి పరిష్కారాలను వెతకాల్సిన అవసరం ఉందన్నారు.

అందుకే ఈ అంశాలను పరిశీలించి వచ్చే నెలలోగా క్యాబినెట్‌కు ఒక నివేదికను అందజేయాలని నేను క్యాబినెట్ సెక్రటరీని కోరినట్టు చెప్పారు. ఇండియా కార్పోరేట్ వీక్ 2010 పేరుతో జరిగిన ఒక సదస్సును ఆయన మంగళవారం ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా, హెచ్‌డిఎఫ్‌సీ ఛైర్మన్ దీపక్ పారిఖ్ వంటి కార్పోరేట్ దిగ్గజాలు ఫోన్ ట్యాపింగ్‌పై ఆందోళన వ్యక్తం చేయగా, ప్రధాని పైవిధంగా స్పందించారు.

వెబ్దునియా పై చదవండి