కర్కరే మృతిపై చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు సేకరిస్తున్నా!!

బుధవారం, 15 డిశెంబరు 2010 (10:03 IST)
మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే మృతిపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. ఈ అంశంపై గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ.. ఎప్పటికీ కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు.

ముంబై దాడుల్లో మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ దారుణానికి కొన్ని గంటలకు ముందు హేమంత్ కర్కరే తనతో మాట్లాడారంటూ దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద ప్రకటన చేసి సంచలనం సృష్టించారు.

ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రంగా స్పందించగా దిగ్విజయ్ సింగ్ కూడా అదే స్థాయిలో స్పందించారు. తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండడమే కాకుండా తాను అబద్ధం చెప్పడం లేదన్నారు.

ముంబై దాడులు జరగడానికి కొద్ది గంటల ముందు కర్కరే తనతో మాట్లాడారని నిరూపించడానికి ఫోన్ రికార్డులు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నానన్నారు. నేను అబద్ధాల కోరును కాదు. కర్కరేతో మాట్లాడానని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. నేను చెప్పిన దానికే కట్టుబడి ఉన్నాను అని ఆయన ప్రకటించారు.

తాను కర్కరేతో ఫోనులో మాట్లాడినట్టు నిరూపించడానికి తన వద్ద రికార్డులున్నాయని, వీటిని సంపాదించే పనిలో నిమగ్నమైవున్నట్టు చెప్పారు. ప్రధానంగా తనకు, కర్కరేకు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలను పుణేలోని రికవరీ సెంటర్‌ నుంచి రికవరీ చేయాలని తాను టెలికాం శాఖను కోరినట్లు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి