2జి స్కామ్: సీబీఐ దాడులతో కాంగ్రెస్-డీఎంకే మైత్రి స్వస్తి!!

గురువారం, 16 డిశెంబరు 2010 (11:25 IST)
తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న చెలిమి ముగింపు దశకు చేరుకుంది. 2జి స్పెక్ట్రం కుంభకోణానికి సంబంధించి డీఎంకే చీఫ్ కరుణానిధి కుమార్తె కనిమొళి, మాజీ మంత్రి ఏ.రాజాతో పాటు కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాళ్ వ్యక్తిగత ఆడిటర్‌‌తో పాటు మొత్తం 27 ప్రాంతాల్లో సీబీఐ దాడులు చేసింది. ఏకకాలంలో జరిగిన ఈ దాడులతో డీఎంకే వర్గాలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఒక అధికార పార్టీకి చెందిన నేతల ఇళ్ళలోనే ఈ తరహా దాడులు చేయడాన్ని పార్టీ చీఫ్‌తో పాటు డీఎంకే శ్రేణులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నాయి.

కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం మైత్రి తెగిపోయినా ఫర్వాలేదనే దిశగా అడుగులు వేస్తూ సీబీఐ దాడులను ప్రోత్సహిస్తోంది. అయితే, వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున కరుణానిధి మాత్రం మౌనం పాటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేయి అందుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు డీఎంకే ప్రత్యర్థి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఇప్పటికే ప్రకటిచిన విషయం తెల్సిందే.

దీంతో డీఎంకే నేతలు కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకునే అంశంపై ఆచితూచి మాట్లాడుతున్నారు. రాజకీయ పరిశీలకులు మాత్రం సీబీఐ దాడులు ఖచ్చితంగా డీఎంకే-కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న సంబంధాలను తెంచేశాయని పునరుద్ఘాటిస్తున్నారు. ఈ దాడుల కారణంగా డీఎంకేను దూరం చేసి అన్నాడీఎంకేతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

2జి స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి తొలుత ఏ.రాజాను టెలికమ్యూనికేషన్ల శాఖ నుంచి తప్పించిన ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం ఏకంగా కరుణానిధి కూతురు, రాజ్యసభ సభ్యురాలు కనిమొళికి సంబంధించిన స్వచ్ఛంద సంస్థపై దాడులు చేయించడం గమనార్హం. యూపీఏకు డీఎంకే ఇస్తున్న మద్దతు ఉపసంహరించుకున్నా ఫరవాలేదనే ధోరణితో కాంగ్రెస్ అధినాయకత్వం వ్యవహరించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి