ఢిల్లీ వేదికగా నేటి నుంచి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు
శనివారం, 18 డిశెంబరు 2010 (09:09 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ 83వ ప్లీనరీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్.. ఇటీవలి కాలంలో పలు కుంభకోణాలు, అవినీతి ఊబిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా భావించే ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తుండటం గమనార్హం. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్..సహా పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులు హాజరయ్యే ఈ సమావేశాల్లో పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సమస్యలు, సవాళ్లపై మేధోమథనం జరగనుంది.
ప్రధానంగా 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ, సీడబ్ల్యూజీ సహా ఇటీవల పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను మసకబారుస్తున్న కుంభకోణాలు, యూపీఏలో విభేదాలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, ఆంధ్రప్రదేశ్ పరిణామాలు, 2011, 2012లలోవివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచన తదితర అంశాలపై చర్చించనుంది. వీటితో పాటు.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏని మరోసారి విజయతీరాలకు చేర్చడమే కీలక అజెండాగా మూడు రోజుల ప్లీనరీలో ప్రధాన అజెండాగా మారనుంది.
ఇకపోతే.. వీటితో పాటు.. రాజకీయ, ఆర్థిక, విదేశాంగ రంగాలపై తీర్మానాలు చేస్తారు. శనివారం పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరిగే తొలి సమావేశంలో పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు, పీసీసీ సారథులు, సీఎల్‌పీ నాయకులు ముసాయిదాలపై చర్చించి తుదిమెరుగులు దిద్దుతారు. పార్టీ ప్రతినిధులు ఆది, సోమవారాల్లో వీటిపై చర్చించి, అవసరమైన మార్పులు చేర్పులు చేసి వాటిని ఆమోదిస్తారు. ప్లీనరీ సమావేశాల ప్రాంగణం వద్ద నాలుగువేల మందికి బస ఏర్పాట్లు చేశారు.