గుజ్జర్ల ఆందోళన: మన్మోహన్ - సోనియా జోక్యానికి విజ్ఞప్తి

సోమవారం, 27 డిశెంబరు 2010 (10:20 IST)
ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కోటా కోసం గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న గుజ్జర్లు.. సమస్య పరిష్కారానికి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలు తక్షణం జోక్యం చేసుకోవాలని సోమవారం విజ్ఞప్తి చేశారు. గుజ్జర్లకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు గత భాజపా ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, ఈ రిజర్వేషన్ కోటా అమలుకు ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

తమ డిమాండ్ సాధన కోరుతూ గత వారం రోజులుగా వారు ఆందోళన చేస్తున్నారు. ఫలితంగా ముంబై, ఢిల్లీల మధ్య పలు రైళ్ళ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లోని గుజ్జర్ ఆర్గనైజేషన్‌ అనుబంధ సంస్థ ట్రైబల్ రీసెర్స్ అండ్ కల్చరల్ ఫౌండేషన్ (టీఆర్సీఎఫ్) ఒక ప్రకటన విడుదల చేసింది. గుజ్జర్లు చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది.

గుజ్జర్లకు ఎస్టీ హోదాతో పాటు కల్పించడమేకాకుండా సామాజిక న్యాయం కల్పించాలని, ఇందుకోసం ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలు జోక్యం చేసుకోవాలని టీఆర్సీఎఫ్ విజ్ఞప్తి చేసంది. ఇదే హోదాను జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో పొందేందుకు తాము తీవ్రంగా పోరాడాల్సి వస్తోందని ఆ సంస్థ కార్యదర్శి జావిద్ రహి అన్నారు.

గుజ్జర్లు 12 రాష్ట్రాల్లో నివశిస్తున్నారు. వీరందరినీ సమానంగా చూడటమే కాకుండా, సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జస్టీస్ చోప్రా కమిటీ నివేదిక ప్రకారమే కేంద్రం చర్యలు తీసుకోవాలని గుజ్జర్లు డిమాండ్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి