తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎర్కాడు ఉప ఎన్నికల్లో తెలుగు ప్రముఖులు ప్రచార బరిలోకి దిగనున్నారు. ఎర్కాడు ఉప ఎన్నికల్లో దాదాపు 25వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఎ.ఐ.ఎ.డి.ఎం.కె అభ్యర్థి సరోజ విజయానికి తోడ్పడటానికి తమిళనాడు తెలుగు సంఘాల నాయకులు శ్రీ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి నాయకత్వంలో దాదాపు 50 మంది తెలుగు ప్రముఖులు ప్రచారం నిమిత్తం ఆరలి వెళ్ళనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఎర్కాడు నియోజకవర్గంలో తెలుగు ప్రముఖులు 27, 28 తేదీలలో తెలుగు ప్రజలు అధికంగా నివశించే ప్రాంతాలలో తెలుగులోనే ప్రచారం చేసి, తెలుగులోనే కరపత్రాలను పంపిణీ చేయనున్నారు.
27, 28 తేదీలలో ఎర్కాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ జీప్‌లో పర్యటించి ప్రచారం చేయనున్నారు. 27వ తేదీన.. ఈ ప్రాంతాల్లో తెలుగు ప్రముఖుల ప్రచారం మొదలవుతుంది. కుప్పనూరు, పళ్ళిపట్ట, పెరుమాళ్ల పాళెంలోని 1, 2, 3, 4 డివిజన్లలో అళ్ళికుట్ట, మన్నారుపాళెం, వైకాశిపట్నం, అయోధ్యపట్నం, పున్నయ్యపేటలో 2 డివిజన్లలో, 28వ తేదీన వెళ్ళికట్టు వరస, గుండుకళ్లురు, సకేలమేడు, కాశీనగరం, పుదుమారియమ్మన్ కోయిల్, పెరియ గొండుపాళెం, అల్లం కోటమే, కారిపట్టి, ఆరవది మైల్, 7వది ఊరు మేల్, వెలికరియ వట్టపత్తి, వజయూర్ పట్టి, వేపం పట్టి, సన్యాసి పాళెంలలో వారు పర్యటించి... తమిళనాడు సీఎం అమ్మ జయలలిత ఆధ్వర్యంలోని A.I.A.D.M.K సాధించిన విజయాలను తెలుగులోనే కరపత్రాలను ముద్రించి వాడ వాడల తిరిగి ప్రచారం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి తెలుగులో "వాడవాడల అమ్మమాట... బంగారుబాట" అనే పేరుతో ప్రచారం చేస్తారు. గతంలో ముఖ్యమంత్రి జయలలిత తెలుగు ప్రజలకు ఇచ్చిన హామీలను దృష్టిలో వుంచుకొని కృతజ్ఞతాపూర్వకంగా ఈ ప్రచార కార్యక్రమం చేపట్టామని, ఇది అందరి బాధ్యతగా నిర్వర్తించనున్నట్లు తెలుగు యువశక్తి సెక్రటరీ డి. శివశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు.