బెంగుళూరు బస్సు ప్రమాదంపై 304 సెక్షన్ కింద కేసు!

బుధవారం, 16 ఏప్రియల్ 2014 (12:33 IST)
File
FILE
కర్ణాటకలో మరో ఘోర బస్సు ప్రమాదం బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుందని, దీనికి సంబంధించి బస్సు డ్రైవర్, ఆపరేటర్‌పై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు ఆ రాష్ట్ర పోలీసులు వెల్లడించారు. దావణగెరె నుంచి బెంగుళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకోవడంతో కనీసం ఆరుగురు సజీవదహనం కాగా మరో 12 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

బెంగుళూరుకు 160 కిలోమీటర్ల దూరంలోని చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్ పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దావణగెరె నుంచి బెంగుళూరు వెళుతున్న ఒక ప్రైవేట్ బస్సు 4వ నంబర్ జాతీయ రహదారిపై మంటల్లో చిక్కుకుని పక్కనే ఉన్న గుంతలో పడిపోయిందని అని చిత్రదుర్గ ఎస్‌పి రవి కుమార్ తెలిపారు.

బస్సులో నుంచి ఇప్పటివరకు పూర్తిగా కాలిపోయిన ఆరు మృతదేహాలను వెలికితీశాము. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా 20 మంది గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అని ఎస్‌పి తెలిపారు.


ఐపిసిలోని 304 సెక్షన్ కింద బస్సు డ్రైవర్, ఆపరేటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సులో మంటలు చెలరేగడానికి కారణం తెలియరాలేదని ఎస్‌పి తెలిపారు. డ్రైవర్ సీటు సమీపంలోని ముందు భాగంలో మొదలైన మంటలు వేగంగా బస్సంతా వ్యాపించాయని, మంచి నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయారని ఆయన వివరించారు.

వెబ్దునియా పై చదవండి