అనంత పద్మనాభుని లక్ష కోట్ల నగలు దోచేశారా...? సంచలనం...

శనివారం, 19 ఏప్రియల్ 2014 (14:39 IST)
FILE
కేరళ తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి పేరు చెబితే లక్ష కోట్ల విలువైన బంగారు నగలు... మూడేళ్ల క్రితం... 2011 వెలుగుచూసిన పద్మనాభుని నగల ఖజానా గుర్తుకు రాకమానదు. ఐతే ఇప్పుడు దీనిపై మరో సంచలనం వెలికి వచ్చింది. అనంత పద్మనాభుని అసలు నగలను దోచేసి ఆ స్థానంలో గిల్టు నగలు పెట్టి ఉంటారంటూ గోపాల్ సుబ్రహ్మణ్యం సంచలన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించడం చర్చనీయాంశమైంది.

ఆ నివేదకలో ఆయన పలు ఆసక్తికర అంశాలను పేర్కొన్నట్లు సమాచారం. అనంత పద్మనాభుని ఆలయంలో బయల్పడిన నగలను మార్చేసి ఆ స్థానంలో నకిలీవి పెట్టి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారాయన. దాదాపు 35 రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన అనంతరం సుబ్రహ్మణ్యం ఈ నివేదికను కోర్టుకు అందజేశారు. ఆలయ సంపద నిర్వహణలో అవకతవకల వెనుక పెద్ద కుట్రే ఉండిఉండవచ్చని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్నంతా బయటకు తీయాలంటే మాజీ కాగ్ వినోద్ రాయ్ తో ఆడిటింగ్ జరిపించాలని కోర్టుకు విన్నవించారు.

కాగా అనంత పద్మనాభుని ఆలయంలో ఏ నుంచి ఎఫ్ వరకు గదులను తెరచి వాటిలోని బంగారం ఆభరణాల విలువ లక్ష కోట్లకు మించి ఉంటుందని లెక్క తేల్చారు. బీ అనే గదిపై నాగ పడగ ఉందని, అది తెరిస్తే వినాశనమేనన్న హెచ్చరికల నేపథ్యంలో దానిని తెరవలేదు. కానీ ఆలయంలో జీ, హెచ్ అనే రెండు గదులు కూడా ఉన్నట్లు సుబ్రహ్మణ్యం కనుగొన్నారు. మొత్తం ఈ 3 గదులను కూడా తెరిచి సంపద ఎంత ఉన్నదో గుర్తించాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి