ఆరోగ్యానికి భయంకరమైన సంవత్సరం : 2009

Gulzar Ghouse

బుధవారం, 23 డిశెంబరు 2009 (18:52 IST)
FILE
" ఆరోగ్యమే మహా భాగ్యం " అనేది భారతదేశంలో ప్రచలితమైన నానుడి. ఇలాగే ఆరోగ్యంపై చాలా జాతీయాలు, లోకోక్తులున్నాయి. కాని ఆరోగ్యంపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం దేశంలో చాలా తక్కువనే చెప్పుకోవాలి. 2009వ సంవత్సరంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను బెంబేలెత్తించింది. ఈ వ్యాధి బారినపడి కొన్ని వేల మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఇంతవరకు ఆ వ్యాధిని నివారించేందుకు సరైన మందు లేకపోవడం గమనార్హం.

దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఇతర జబ్బులతో బాధపడేవారు కూడా మృతి చెందిన దాఖలాలు చాలానే ఉన్నాయి. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న జబ్బులు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొరవడుతుండుతున్నాయి. ప్రతి నగరం, పట్టణాలలో వైద్యసౌకర్యాలున్నప్పటికీ అవి సాధారణ పౌరునికి అందడం లేదనడంలో అతిశయోక్తి లేదు.
FILE


ముఖ్యంగా ప్రభుత్వ వైద్యశాలల్లో మహమ్మారి వ్యాధికే కాకుండా ఇతర జబ్బులకు తీసుకోవాల్సిన చర్యలు ఏమంత ఆశించినంతగా లేదు. ఇల్లు మండుతుంటే బావి తవ్వే చందంగా మన వైద్యాధికారులు, శాస్త్రజ్ఞులున్నారనడంలో సందేహం లేదు. నగరాలు, పెద్దపెద్ద పట్టణాలలోనే ఇలాంటి పరిస్థితివుంటే మరి చిన్న పట్టణాలు, గ్రామాలలోని ప్రజల పరిస్థితి ఏంటి?

స్వైన్‌ ఫ్లూ మహమ్మారి పరిస్థితిని పక్కన పెడితే మధుమేహ వ్యాధి, రక్తపోటు, అన్ని రకాల క్యాన్సర్, ఎయిడ్స్, డెంగ్యూ, బాలింతల చావులు, ప్రసవ సమయంలో జరుగుతున్న చావులు, గుండెపోటు, ఆస్తమా, మలేరియా, హెపటైటిస్, టీబీ, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ హెమరేజ్ తదితర జబ్బులతో బాధపడుతూ మృతి చెందిన వారి సంఖ్య కోకొల్లలుగా ఉంది.

ఇదిలావుండగా దేశంలో ఆకలిచావులు, అతివృష్టి, అనావృష్టి చావులు, ఉన్మాద చర్యల కారణంగా మృతి చెందేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాగే చర్మ సంబంధిత రోగాలు మరింతగా విస్తరిస్తున్నాయి. 2009లో కేవలం ప్రకృతి పరమైన ఇబ్బందులో కాదు, స్వతహాగా చేసుకున్న చాలా అపరాధాల కారణంగా అమాయకులు మృత్యువాత పడ్డారు. ఇందులో శుభ్రత పాటించకపోవడం, సరైన పోషకాహారం లభించకపోవడంతో చాలామంది జబ్బులబారిన పడుతున్నారు.

FILE
స్వైన్‌ ‌ఫ్లూ : స్వైన్‌ ఫ్లూ మహమ్మారి వ్యాధికారక లక్షణాలు మెక్సికోలోని వేరాక్రూజ్ ప్రాంతంలో ఓ పంది పెంపుడు కేంద్రంవద్దనున్న ప్రజలలో కనిపించాయి. ఈ వ్యాధికారక క్రిములు హెచ్1 ఎన్1 వైరస్ పేరుతో వ్యాపించాయి. ఈ వ్యాధికి సంబంధించిన వైరస్ పంది ద్వారా వ్యాప్తి చెందింది. స్వైన్ ఫ్లూ వ్యాధిని సాధారణమైన ఫ్లూగా పేర్కొనడం సాధ్యం కాదు. కాని ఫ్లూతో బాధపడే వారిలో స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు వ్యాపించడం పెరిగింది.

తాజా లెక్కల ప్రకారం డిసెంబరు 2009 నాటికి స్వైన్ ఫ్లూ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 6, 22,482 చేరుకుంది. అదే ఈ వ్యాధి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 10,582కు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత శనివారం( 19.12.09) తెలిపింది. మనదేశం విషయానికి వస్తే ఈ వ్యాధిబారిన పడినవారి సంఖ్య 21,731లకు చేరుకుంది. అదే మృతి చెందినవారి సంఖ్య 700లకు చేరుకుంది. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది

అమెరికాలో 6131, యూరోప్‌లో 1242, ఆగ్నేయాసియాలో 814, పశ్చిమ దేశాలలో 848, తీరప్రాంతలాలో 452, ఆఫ్రికాలో 109 మంది మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి