ఎన్నారై వెంకట్రామన్‌కు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం

FILE
భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త వెంకట్రామన్ రామకృష్ణన్ ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. మానవ జీవితంలో కీలకమైన రైబోజోమ్‌లపై చేపట్టిన పరిశోధనలలో, కొత్తతరహా యాంటీ బయాటిక్స్ ఔషధాల తయారీకి మార్గం సుగమం చేసిన వెంకట్రామన్‌తోపాటు మరో ఇద్దరితోపాటు ఉమ్మడిగా ఈ అవార్డును కైవసం చేసుకున్నారు.

అమెరికా శాస్త్రవేత్త థామస్ స్టీట్జ్, ఇజ్రాయెల్ మహిళా శాస్త్రవేత్త అదా యోనత్‌లతో పాటు వెంకట్రామన్ అత్యున్నత నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ అవార్డు కింద బహుమతిగా వచ్చే నగదు 14 లక్షల డాలర్లను కూడా ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు సమానంగా పంచుకుంటారు.

పై ముగ్గురు శాస్త్రవేత్తలు జీవాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవటంలో తోడ్పడే రైబోజోమ్‌లపై పరిశోధనలు జరిపారు. రైబోజోమ్‌కు సంబంధించిన పరమాణువుల్ని ఒడిసి పట్టుకున్నారు. పరమాణు స్థాయిలో అదెలా పనిచేస్తుందనేది గమనించి, ఒక్కో పరమాణువుకు సంబంధించిన పటాన్ని రూపొందించారు. రైబోజోమ్‌లోని వేల సంఖ్యలోని పరమాణువుల్ని గుర్తించేందుకు వీరు ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ అనే పద్ధతిని ఉపయోగించారు.

కాగా.. నేడు మనం వాడుతున్న పలు యాంటీ బయాటిక్స్ మందులు బ్యాక్యీరియల్ రైబోజోమ్‌ల పనితీరును అడ్డుకోవటం ద్వారానే పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న రకాల యాంటీ బయాటిక్స్ రైబోజోమ్లను ఎలా అడ్డుకుంటాయనేది వివరించేందుకు పై ముగ్గురు శాస్త్రవేత్తలు త్రీడీ మోడల్స్‌ను రూపొందించారు. ఇప్పుడు ఈ మోడల్స్‌ను ఉపయోగించుకునే పలువురు శాస్త్రవేత్తలు కొత్త తరహా యాంటీ బయాటిక్స్ ఔషధాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ సందర్భంగా... వెంకట్రామన్, థామస్ స్టీట్జ్, అదా యోనత్‌‌ల పరిశోధనలు ఔషధ రంగంలో పలు విప్లవాత్మక మార్పులకు దారి తీస్తాయని విజేతలను ఎంపికచేసే స్వీడిష్ అకాడమీ ప్రశంసల వర్షం కురిపించింది. కొత్త తరహా యాంటీ బయాటిక్స్ ఔషధాల తయారీకి దోహదపడేలా వీరు చేసిన పరిశోధనలు కూడా అమోఘమని అకాడమీ వ్యాఖ్యానించింది.

వెబ్దునియా పై చదవండి