కృత్తికా నక్షత్రంలో జన్మించిన మహిళలు సౌందర్యవంతులుగా ఉంటారని జ్యోతిష్యులు అంటున్నారు. ఇతరులను ఆకర్షించే ఛాయను కలిగి ఉంటారు. ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు. ఇతరులకు సహకరించే స్వభావులు. అయితే పట్టుదల స్వభావంతో తాము అనుకున్న కార్యాన్ని పూర్తి చేసే వరకు ఏ మాత్రం ఊరుకోరు.
ఈ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన జాతకులు విద్యలో రాణిస్తారు. భవిష్యత్తు ప్రణాళికను ఉద్దేశించి వాటిని నడిపించటానికి ఎల్లప్పుడు తీవ్రంగా శ్రమిస్తారు. బుద్ధికుశలతతో ఎట్టి క్లిష్ట పరిస్థితినైనా ధీటుగా ఎదుర్కోగలరు.
రెండో పాదంలో జన్మించిన స్త్రీలు ప్రతి విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసే స్వభావం కలిగి ఉంటారు. దీనివలన జీవిత పురోగమన అవకాశాలు దూరమవుతాయి. కోపంతో చెడుమార్గాలను ఎంచుకునే పరిస్థితులు ఎదురవుతాయి. చెడు స్వభావం చేత ఇతరులకు ఇబ్బందులు ఏర్పడుతాయి. అందుచేత ఈ స్వభావాన్ని దూరంగా ఉంచడం చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
మూడో పాదంలో జన్మించిన మహిళా జాతకులు ఎట్టి కార్యాన్నైనా సమర్థవంతంగా సాధించగలుగుతారు. చెడుమార్గం, దురాలోచనతో జీవితంలో అభివృద్ధి చెందలేరు. అయితే వీరికి గల బుద్ధికుశలతను మంచి మార్గంలో ఉపయోగిస్తే జీవితంలో పురోగమనం వైపు పయనిస్తారు.
నాలుగవ పాదంలో జన్మించిన వారికి ఓర్పు ఎక్కువ. ఒక కార్యాన్ని అనేక సార్లు ఆలోచించి సరైన నిర్ణయాన్ని ఎంచుకునే స్వభావం కలవారై ఉంటారు. ఇతరుల ఆధీనంలో బతకటం వీరికి ఇష్టం ఉండదు. ఇతరులను తమ ఆధీనంలోకి తీసుకుని అధికారం చెలాయిస్తారు.
ఇక వీరికి బుధవారం అన్ని విధాలా కలిసొస్తుంది. అలాగే 6, 4, 5, 8 వంటి సంఖ్యలు వీరికి అన్ని విధాలా అనుకూలిస్తాయి. వీరికి తెలుపు, నీలం అదృష్టమైన రంగులు.