పునర్వసు నక్షత్రంలో పుట్టారా? ఐతే సువర్ణమంటే మోజట!
FILE
గురుగ్రహ నక్షత్రమైన పునర్వసు నక్షత్రములో పుట్టిన జాతకులు ఇతరుల విషయాలపై అనవసరంగా దృష్టి సారిస్తారు. అలాగే ఈ జాతకులకు సువర్ణం పట్ల మోజు ఎక్కువని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. సౌకర్యవంతమైన ఉద్యోగాల్లో స్థిరపడే ఈ జాతకులు, సమస్యలను పరిష్కరించగల వ్యక్తిగా, స్వయం శక్తితో ఎదుగుతారు.
సమాజంలో ఉన్నత స్థాయి వర్గానికి నాయకత్వం వహిస్తారు. ఇతరులతో పరిచయాలు కార్యసిద్ధికి ఉపయోగించుకుంటారు. సొంత పనుల కంటే ఇతరుల పనులు బాగా నెరవేర్చగలుగుతారు.
కానీ సంసార జీవితంలో మాత్రం బేధాభిప్రాయాలు ఉంటాయి. సంతానానికి సంబంధించిన క్లేశం కొంతకాలం ఇబ్బంది పెడుతుంది. వీరికి ఆయుర్వేదం, వైద్యం, సువర్ణము ఎగుమతి దిగుమతులు లాభిస్తాయి. సంసార జీవితంలో సర్దుకుపోవడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
పునర్వసు నాలుగు పాదాల్లో పుట్టిన జాతకులకు బుధవారం అన్ని విధాలా అనుకూలిస్తుంది. గురువారం కూడా మంచి ఫలితాలనిస్తుంది. కానీ సోమవారం మాత్రం ఈ జాతకులకు కలిసిరాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పునర్వసు నక్షత్రములో జన్మించిన జాతకులకు ఐదు అనే సంఖ్య శుభఫలితాలనిస్తుంది.
ఇంకా అదృష్ట రంగు విషయానికొస్తే పసుపు రంగు వీరికి అన్ని విధాలా అనుకూలిస్తుంది. కాబట్టి ఎప్పుడూ పసుపు రంగు చేతి రుమాలును వాడటం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.