ప్రీతి అనగా సంతోషం, స్నేహం, ప్రేమ, సుఖం, దయ ఇలా ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి వస్తువు, వైభవాలే కాక పదార్థాలు, అలంకారాల పైనా మక్కువ పెంచుకోవడం ప్రీతిగా భావించవచ్చు. ప్రీతి ఉండటంలో తప్పులేదు. కాని, దేనిలోనూ అతి పనికి రాదు.
ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కరిపై ప్రీతి, అనుబంధం లాంటివి ఏర్పడతాయి. వారిలో నచ్చే గుణాలు వల్ల కావచ్చు, ఇద్దరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉండటం కావచ్చు... జన్మజన్మలుగా మనతో ఏర్పడిన కర్మ సంబంధం వల్ల కావచ్చు.... అనుబంధం ఏర్పడుతుంది. అలాంటివారు సహజంగానే మనతో కలిసిపోతారు. కొన్ని అనుబంధాలు జీవితాంతం కొనసాగుతుంటాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారి మధ్యనున్న బంధం మరింత బలపడుతుంది.
ఇతరులకు ప్రీతిపాత్రులం కవాలనుకుంటే మన నడవడిక, లక్షణాలు, గుణగణాలు వ్యక్తిత్వమనేవి వారిని ఆకర్షించగలగాలి. అలా ఉన్నప్పుడే ఎదుటివారికి మనతో స్నేహం చేయాలనే ఆలోచన కలుగుతుంది. ఈ లక్షణం బలవంతంగా తెచ్చి పెట్టుకునేది కాదు. బాహ్యరూపంలో ప్రదర్శించేది అంతకన్నా కాదు. స్వతహాగా మనలో పెంపొందించుకోవాలి. మన నడవడిలో కనిపించాలి.
మనిషికి, మనిషికి మధ్యనున్న అనుబంధాలు ఎంతో కొంత స్వార్థంతో కూడుకున్నవే. అయితే భగవంతుడికి, భక్తుడికి మధ్యగల ప్రీతి నిర్మలమైనది. అలాంటి ప్రేమకే భగవాసుడు వశమవుతాడు. తప్ప స్వార్థంతో కూడిన కోరికలకు ఆయన లోబడడు. భక్తితో భగవంతుడిని మెప్పించి, ఆయనకు ప్రీతిపాత్రులైన వారు ఎందరో ఉన్నారు. ప్రీతితో శబరి అర్పించిన పళ్లను రామచంద్రడు ఆనందంగా భుజించాడు.
ప్రీతితో మీరాబాయి ఆలపించిన గీతాలకు కృష్టభగవానుడు పరవశించాడు. నిండు ప్రేమతో అర్పించినది ఏదైనా భగవంతుడు ఆప్యాయంగా స్వీకరిస్తాడు. నిస్వార్థ ప్రేమకు దేవుడు తప్పకుండా వశుడవుతాడు. ప్రీతితో ఆరాధించే తన భక్తులకు కష్టాలు రాకుండా కాపు కాస్తాడు. దేవుడి యందే కాదు సాటి మనుషుల పట్ల కూడా ప్రేమభావంతో మెలగాలి. ఈ సత్యం గ్రహించి అందరికీ ప్రీతిపాత్రులయ్యే శ్రేష్టకర్మలు ఆచరించాలి. అప్పుడే పరస్పర వైరాలు తొలిగిపోయి ఈ ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.