సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో జరిగే చందనోత్సవంలో పాల్గొనే వారికి సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. స్వామివారికి చందనోత్సవం సందర్భంగా జరిగే అభిషేకాల తర్వాత స్వామివారిని దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం.
ఈ చందనోత్సవం ఈ నెల 16వ తేదీన వైభవంగా జరుగనుంది. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైశాఖ శుద్ధ తదియనాడు ఆనవాయితీగా నిర్వహించే ఈ ఉత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అక్షయ తృతీయ నాడు సాంప్రదాయకంగా జరిగే ఈ ఉత్సవం, ఆదివారం (16వ తేదీ) తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ప్రారంభమవుతుంది.
ఒంటి గంట నుంచి జరిగే ప్రత్యేక పూజలకు అనంతరం బంగారు బొరిగెలతో స్వామివారి దేహంపై గల చందనాన్ని తొలగిస్తారు. గంగధార నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు.
తర్వాత వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య స్వామి వారి ఎదపై, శిరస్సుపై రెండు చందనం ముద్దలు ఉంచి ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి వంశీయులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.
తదనంతరం స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించి మూడు మణగుల పచ్చి చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పిస్తారు. దీంతో నరసింహ స్వామి నిజరూప దర్శనం నుంచి తిరిగి నిత్యరూపంలోకి వస్తారు.
నరసింహస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవంలో పాల్గొనే వారికి ఈతిబాధలు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయని ఆలయ పురోహితులు చెబుతున్నారు. నిజరూప దర్శనంలో స్వామివారిని దర్శించుకునే వారికి వ్యాపారాభివృద్ధి, సంతాన ప్రాప్తి సిద్ధిస్తుందని వారు అంటున్నారు.