శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారం... విజయ దశమి అనే నామం అందుకే వచ్చింది...
మంగళవారం, 11 అక్టోబరు 2016 (11:20 IST)
“అంబా శాంభవి చంద్రమౌళి రబలా వర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రిణయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మి ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ ! శ్రీ రాజరాజేశ్వరి.”
శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజరాజేశ్వరీ దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది. అమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది. ఈమె స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము.
ఇఛ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. అమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దేపితం చేస్తుంది. అనంత శక్తిస్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అధిష్టాన దేవత. ఈ పర్వదినాన అమ్మవారికి పులిహోర, గారెలు నైవేద్యంగా సమర్పించి పూజించాలి.
దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము.
ఈ పర్వదినాన చేసే 'శమీపూజ' చాలా విశేషమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'.
అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించినారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు.
తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.