అమ్మాయీ... నువ్వు కార్చిన కన్నీటి బిందువులే రోగాలై ప్రజల్ని పీడిస్తాయి...

సోమవారం, 8 జనవరి 2018 (15:13 IST)
అకంపనుడనే రాజుకి ఒకప్పుడు శత్రువులతో యుద్ధం వచ్చింది. అతను శత్రువుల చేతిలో పట్టుబడేసరికి అతడి కొడుకు వీరవిహారం చేసి తండ్రిని విడిపించాడు. ఐతే ఆ వీర కిశోరాన్ని అధర్మ మార్గాన అభిమన్యుడిని చంపేసినట్లు అనేకమంది చుట్టుముట్టి చిత్రవధ చేసి చంపారు. ఇది తెలిసిన అకంపనుడు పుత్రశోకాన్ని భరించలేకపోయాడు. కొడుకుని తలుచుకుని వెక్కివెక్కి ఏడ్వసాగాడు. ఎంతకీ అతడు దుఃఖాన్ని విడువక అలాగే ఖిన్నుడై నిద్రాహారాలు మాని చిక్కిశల్యమవుతున్నాడు. అతడి దీనస్థితిని చూసిన నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. 
 
''అకంపనా... ఏంటిది? మరణించనివారెవరైనా వుంటారా? అంతమంది యోధుల్ని చంపిన నీ కుమారుడు సామాన్యుడా, మహావీరుడు. అలాంటి వీరుడికి శత్రువులు బాణాలు వేయక పూలు చల్లుతారా ఏమిటి? చావుని తప్పించుకోవడం ఎవరితరం చెప్పు. అన్నీ తెలిసిన నువ్వే ఇలా దుఃఖించడం తగదు. ధైర్యం తెచ్చుకుని ముందుకుసాగు" అని ఓదార్చాడు. 
 
అంతటి అకంపనుడు... ''మహాత్మా, మృత్యువు లేకుండా బ్రతికలేమా, అసలీ చావుపుట్టుకలు ఎందుకు?'' అని ప్రశ్నించాడు. అప్పుడు నారదులవారు ఇలా చెప్పారు. 
 
''పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించి వూరుకున్నాడు. సంహారం సంగతి ఆలోచనే చేయలేదు. దీనితో జనాభా అంతకంతకూ పెరిగిపోయి భూమికి భారమైపోయారు. అప్పుడు ఏం చేయాలో తోచలేదు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక విపరీతంగా బాధపడటం మొదలుపెట్టాడు బ్రహ్మ. దానితో అతడి అవయవాల నుంచి ప్రళయాగ్ని పుట్టి ప్రజా సంహారం మొదలుపెట్టింది. భువనాలన్నీ తగులబడిపోతున్నాయి. ఇది చూసిన పరమేశ్వరుడు పరుగుపరుగున బ్రహ్మ వద్దకు వచ్చాడు. 
 
'అయ్యా... నీవల్ల పుట్టింది సృష్టి. దీన్ని నువ్వే ఇలా కోపగించుకుని నాశనం చెయ్యడం తగదు. దయతో ఈ భూతజాలాన్ని కరుణించు' అని వేడుకున్నాడు. ఆ మాటలు విని ప్రసన్నుడయ్యాడు బ్రహ్మ. అతడు కోపాన్ని దిగమ్రింగుకునే సమయంలో అతని ఇంద్రియాల నుంచి ఓ స్త్రీ జన్మించింది. నల్లని శరీరం, నిప్పుకణికల్లాంటి కళ్లు, ఎర్రటి వస్త్రాలు ధరించి అతి భయంకరంగా వుంది. చకచకా నడిచి వెళుతోంది. ఆమెను చూసిన బ్రహ్మ... అమ్మాయీ ఎక్కడికి వెళుతున్నావు. ఇలా రా అని పిలిచాడు. ఆమె వచ్చి వినయంగా నిలబడింది. 
 
నాలో పుట్టిన క్రోధం వల్ల నువ్వు జన్మించావు. అందువల్ల నా ఆజ్ఞ ప్రకారం నువ్విక ప్రాణుల్ని సంహరిస్తూ వుండు అని ఆజ్ఞాపించాడు. అందుకామె జలజలా కన్నీళ్లు కార్చింది. కరుణామూర్తీ, నువ్వు నన్ను సృష్టించావు. ఈ దుర్మార్గపు పని ఎలా చెయ్యమంటావు. ప్రజల ఏడుపును నేను చూడలేను. ఈ అధర్మానికి నన్ను పంపకు. నేను ధేనుకాశ్రమానికి వెళ్లి తపస్సు చేసుకుంటాను. నాకు అనుజ్ఞ ఇచ్చి పంపు అని వేడుకుంది. 
 
నిన్ను ప్రజా సంహారం కోసం మాత్రమే సృష్టించాను. కనుక మనసులో ఎలాంటి విచారాలు పెట్టుకోకు. సమయాన్ని అనుసరించి మనుషులను చంపుతూ వుండు అని అన్నాడు. బ్రహ్మ మాట కాదంటే ఏమవుతుందోనని ఆ యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. నంద, కౌశికి అనే నదుల మధ్య ప్రదేశంలో అనేక వ్రతాలు చేసింది. చివరకు హిమశైల శిఖరానికి చేరి అక్కడ తపస్సు చేసుకుంటోంది. 
 
ఐతే బ్రహ్మ అక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు. పిచ్చిదానా... ప్రజా సంహారం వల్ల నీకు అధర్మం ఎలా కలుగుతుంది. నా ఆజ్ఞ పాటించడం నీ ధర్మం కాదా అని ప్రశ్నించాడు. నీకు అత్యుత్తమ కీర్తి వచ్చేట్లు నేనూ, పరమేశ్వరుడు అనుగ్రహిస్తాం.. సరేనా అని అన్నాడు. 
 
అంతట ఆమె బ్రహ్మకు నమస్కరిస్తూ... ప్రభూ, నీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. నాలుగు రకాల భూతజాలాన్నీ సంహరిస్తాను. కానీ లోభం, క్రోధం, అసూయ అనేవి ప్రాణుల శరీరాలను వికృతం చేసేట్లు చూడు తండ్రీ అని అంది దుఃఖిస్తూ. 
 
అందుకు బ్రహ్మ... అలాగే, అంతేకాదు.. ఇప్పుడు నువ్వు కార్చిన కన్నీటి బిందువులే రోగాలై ప్రజల్ని పీడిస్తాయి. అవి మరణాలను సంభవింపజేస్తాయి. అందుచేత నీకు ఏ అధర్మం అంటదు. ప్రాణుల్ని చంపడమే నీ లక్ష్యం, ధర్మం. నువ్వు తరతమ భేదాలు మరిచి అందర్నీ ఆకర్షించు, వెళ్లు అని బ్రహ్మ ఆజ్ఞాపించాడు. 
 
బ్రహ్మ ఆజ్ఞను తిరస్కరిస్తే శపిస్తాడేమోనన్న భయంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పటినుంచి మనోవ్యధ ప్రాణులను కృశింపచేస్తుంటే మృత్యువు ప్రాణం తీస్తూ వుంటుంది. శరీరాన్ని రక్షించడానికి, నాశనం చేయడానికి కారకుడు జీవుడు. నరులు దేవతలవుతారు. దేవతలు మనుషులవుతారు. నీ కొడుకు చిర వీరస్వర్గం అనుభవిస్తున్నాడు. అతనికోసం విచారం ఎందుకు'' అని అన్నాడు నారదుడు. 
 
దానితో అకంపనుడు... మునీంద్రా, నువ్వు చెప్పిన కథ విన్నాక నా మనసు కుదుటపడింది. విచారం పోయింది అని అన్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు