రాష్ట్రంలో విష్ణు, లక్ష్మీదేవి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?

శుక్రవారం, 16 సెప్టెంబరు 2011 (17:11 IST)
FILE
మన రాష్ట్రంలో ప్రఖ్యాత విష్ణుక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా.. కృష్ణాజిల్లాలోని దివి తాలూకాలోని శ్రీకాకుళం ఆంధ్ర మహా విష్ణువు ఆలయం. ఇది గాక లక్ష్మీనారాయణ ఆలయాలు, భావన్నారాయణ ఆలయాలు విష్ణుమూర్తికి సంబంధించినవే. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో, జైనాథ్‌లో ఉన్న లక్ష్మీనారాయణ ఆలయం బాగా ప్రసిద్ధి.

కృష్ణాజిల్లాలోని దివిసీమలో పంచలక్ష్మీనారాయణ ఆలయాలు ఉన్నాయి. ఇక కాకినాడ దగ్గర సర్పవరంలో, కొవ్వూరు దగ్గర పట్టెసంలో, దివిసీమలోని భావ దేవరపల్లిలో, గుంటూరు జిల్లాలోని పొన్నూరులో, ఒంగోలు దగ్గర ఉన్న పెదగంజాలలో పంచభావన్నారాయణ ఆలయాలు ఉన్నాయి. ఇక అన్నవరంలోని సత్యనారాయణస్యామి ఆలయం అందరికీ తెలిసిందే. పిఠాపురంలోని కుంతీమాధవస్వామి ఆలయం కూడా విష్ణురూపమే.

ఇవన్నీగాక విష్ణుమూర్తి ధరించిన దశావతారములకు సంబంధించిన ఆలయాలు అన్నీ విష్ణుమూర్తి ఆలయాలే అని చెప్పవచ్చు. ఇందులో మొదటిది మత్స్యావతారం. చిత్తూరుజిల్లాలో ఉన్న నాగులాపురంలో వేదనారాయణుడు అనే పేరుతో ఉన్న ఆలయంలో విష్ణుమూర్తి మత్స్యావతారంలో వున్న మూర్తి ఉంటుంది.

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీకూర్మం ఆలయం అందరికీ తెలిసిందే. తిరుమల కొండమీద పుష్కరిణి ఒడ్డునే ఉన్న వరాహస్వామి ఆలయం కూడా అందరికీ తెలిసిందే. ఇక నరసింహాలయాలు భారతదేశం మొత్తం మీద మన రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నాయి. రామాలయాలు, కృష్ణాలయాలు ఎన్ని వున్నాయో లెక్క చెప్పలేము.

ఇక్కడో చిన్న విశేషం. ఈ మధ్య అనేక ఊళ్లలో వెంకటేశ్వరాలయాలు తామరతంపరగా వెలిశాయి. మన రాష్ట్రంలో 15 లేక 16వ శతాబ్దాలకాలం నాటివి, అంతకంటే ప్రాచీన కాలంనాటివి మొత్తం పదిహేడు వెంకటేశ్వరాలయాలు ఉన్నాయి. ఈ విషయం చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు.

లక్ష్మీదేవి ఆలయాలు మనదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?
విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలలోని దేవి మూర్తులు కొందరు మహాలక్ష్మీ, రాజ్యలక్ష్మీ మొదలైన పేర్లు కలిగి ఉండటమే సాధారణం. అయితే కేవలం లక్ష్మీదేవి పేరుతోనే ప్రసిద్ధమైన ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న మహాలక్ష్మీ ఆలయం ఒక్కటే.
FILE


ముంబాయి నగరంలో ఉన్న మహాలక్ష్మీ ఆలయం కూడా ప్రసిద్ధమైనదే కాని ఎందుకనో అది ఆ నగరవాసులకే తప్ప బయట వారికి అంతగా తెలియదనే చెప్పవచ్చు. కాగా, జమ్ము దగ్గర ఉన్న వైష్ణోదేవి ఆలయంలో, లక్ష్మీదేవితో పాటు సరస్వతి, కాళిమూర్తులు కూడా ఉంటాయి. మద్రాసులోని అష్టలక్ష్మీ ఆలయం ఇటీవలది.