మసీదులకే తలమానికం "తాజుల్ మసీదు"

ఆదివారం, 16 డిశెంబరు 2007 (17:54 IST)
WD PhotoWD
ఆసియా ఖండంలో అతిపెద్దదైన మసీదుగా పేరొందిన 'తాజూల్ మసీదు' భోపాల్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పవిత్రమైన ఈ ప్రార్థన మందిరాన్ని 'జమా మసీదు'గాను 'మసీదులకు తలమానికం'గాను స్థానికులు పిలుచుకుంటారు. ఇక్కడ మీరు ఆధ్యాత్మిక భావనలను పొందవచ్చు. మసీదులోని ప్రధాన హాలులోకి దారి తీసే మార్గంలో ప్రధానమైన ఆవరణ మీకు కనిపిస్తుంది. ఆవరణలో ప్రధాన హాలును ప్రతిబింబించే తటాకం మిమ్మల్ని ఇట్టే ఆకర్షిస్తుంది. ప్రధాన హాలులో భక్తులు 'నమాజు' చేసుకుంటారు. ప్రధాన హాలుకు అనుబంధంగా అద్భుతమైన 'మదరసా' నిర్మితమై ఉంది.

గులాబీ వర్ణంతో అలరారే అతిపెద్దదైన ఈ మసీదు భారీ గుమ్మటపు పైకప్పును కలిగిన రెండు శ్వేత స్తంభాలు మరియు మూడు తెల్లని గుమ్మటాలు ప్రధాన భవంతిపై నిర్మితమై శోభాయామానంగా కనిపిస్తోంది. వైవిధ్యానికి నెలవైన ఈ స్మారక భవనం మానవీయతను కలిగించే పథ నిర్దేశాన్ని గావిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. భోపాల్ ప్రాంత కళాకారులచే నిర్మించబడిన ఈ మసీదు, భారతీయ మరియు ఇస్లామీయ కళలతో కూడిన భవన నిర్మాణ పద్దతులతో
WD PhotoWD
భాసిల్లుతోంది.

మసీదు గోడలపై ఆహ్లాదాన్ని కలిగించే సౌందర్యభరిత పుష్పాలు చెక్కబడి ఉన్నాయి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ సతీమణి కుదిసియా బేగం ఈ మసీదును నిర్మించారని నమ్మిక. ఈద్ పండుగ సమయంలో ఈ మసీదు సంపూర్ణమైన ఆధ్యాత్మిక వాతావరణానికి తార్కాణంగా నిలుస్తోంది. ఈద్ పండుగను పురస్కరించుకుని వేలాదిగా ఇక్కడకు విచ్చేసే భక్తులు తమ శిరసు వంచి వినమ్రంగా నమాజు చేస్తారు. కుల మత భేదాలకు అతీతంగా అన్ని మతాలకు చెందిన ప్రజలను ఈ మసీదు సాదరంగా అక్కున చేర్చుకుంటోంది.

WD PhotoWD
కుతుబ్‌ఖానా గ్రంథాలయం - మసీదులో ఒక గ్రంథాలయం కూడా ఉంది. ఉర్దూ సాహిత్యానికి సంబంధించిన అరుదైన రచనలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. అంతేకాక ఇస్లాం మత పవిత్ర గ్రంథమైన ఖురాన్ బంగారు సిరాతో లిఖితమై కనిపిస్తుంది. ఈ పుస్తకాన్ని అలంగీర్ ఔరంగజేబ్ సంకలనం చేశారని చెప్పబడింది. ఉర్దూ భాషలోని సాహితీ వ్యాసాలు, పత్రికలు ఈ గ్రంథాలయంలో చోటు చేసుకున్నాయి.

ఇజ్‌తిమా - గత 60 సంవత్సరాలుగా ప్రతి ఏటా మూడు రోజుల పాటు జరుగుతూ వస్తున్న ఇజ్‌తిమా సమ్మేళనంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి
WD PhotoWD
ప్రజలు ఇక్కడకు విచ్చేస్తుంటారు.

చేరుకునే మార్గం- మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నగరమైన భోపాల్‌కు ప్రతి ఒక్కరు సులభంగా చేరుకోవచ్చును.

విమాన మార్గం- న్యూఢిల్లీ, గ్వాలియర్, ఇండోర్ మరియు ముంబై నగరాల నుంచి ఇక్కడకు విమాన సర్వీసులు ఉన్నాయి.

రైలు మార్గం- భారతదేశంలోని ప్రధాన నగరాలకు భోపాల్ నగరం కలుపబడింది.

రోడ్డు మార్గం- ఇండోర్, మాండు, ఖజరహో, పంఛ్‌మడి, గ్వాలియర్, సాంఛీ, జబల్‌పూర్ మరియు శివ్‌పురి నగరాల నుంచి ఇక్కడకు బస్ సదుపాయం కలదు.