24న సెప్టెంబరు నెల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

వరుణ్

మంగళవారం, 18 జూన్ 2024 (15:47 IST)
సెప్టెంబరు నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టిక్కెట్లను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నట్టు తిరుమల దేవస్థాన బోర్డు (తితిదే) అధికారులు వెల్లడించారు. ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తామని తెలిపింది. ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సట్ టీటీ దేవస్థానమ్స్, ఏపీ.జీవోవీ.ఇన్‌లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. 
 
కాగా, శ్రీవారి ఆర్జితసేవా టికెట్లను 18వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే లక్కీడిప్ టికెట్లు మంజూరవుతాయి. అలాగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల టికెట్లను 21వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన ప్లాట్లకు చెందిన కోటాను విడుదల చేస్తారు. 
 
22న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలోని గదుల కోటాను, 27న ఉదయం 11 గంటలకు శ్రీవారిసేవ, 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం ఒంటిగంటకు పరకామణి సేవ టోకెన్లను విడుదల చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు