నేటి మోడ్రన్ లవ్ వరల్డ్‌లో అధికులు "ప్లాటోనిక్ లవ్"లో పడి కొట్టుమిట్టాడుతున్నారని అంటున్నారు మానసిక నిపుణులు. ఇంతకీ ఏమిటీ ప్లాటోనిక్ లవ్..? ఎలా ఉంటుంది...?
"ప్లాటోనిక్ లవ్"లో లైంగిక సంబంధాలు ఉండవు. కేవలం మానసిక సంబంధం మాత్రమే. శరీరాల స్పర్శ కూడా ఉండదు. అయితే ఆ ఇద్దరి మధ్య మాత్రం ప్రేమికులకు మించిన సాన్నిహిత్యం ఉంటుంది. ఇటువంటి విచిత్రమైన సంబంధాల స్వరూపాలను అర్థం చేసుకోవడం కొంత కష్టమే.
ఇలాంటి సంబంధాలు గురించి అనేక అనుమానాలు, రకరకాల అపార్థాలు రావడం జరుగుతుంటుంది కూడా. కానీ నేటి సమాజంలో ఇటువంటి ప్రేమ అక్కడక్కడా మొగ్గలు తొడుగుతోంది.
మన దేశంలో ఈ ప్లాటోనిక్ లవ్‌ను బాలీవుడ్ సినిమాల్లో తెరకెక్కించారు. "హమ్ తుమారే హై సనమ్"లో షారుక్, మాధురీ, సల్మాన్ల మధ్య నడిచే సన్నివేశాలు ఇటువంటి ప్రేమనే సూచిస్తాయి. ఇక మామూలు ప్రపంచంలోకి వస్తే, నేడు ఎవరికివారు ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉండాల్సిన పరిస్థితి.
ఇటువంటి సమయంలో చాలా కార్యాలయాల్లో స్త్రీ, పురుషులు పరస్పరం స్నేహంగా మెలగాల్సిన అవసరం మరీ ఎక్కువ. అయితే ఆ స్నేహం... "ఇంటిమేట్ అండ్ ఎఫెక్షనేట్ బట్ నాట్ సెక్సువల్" స్థాయికి వెళ్లిపోతోంది. దీనినే ప్లాటోనిక్ లవ్ అని అంటున్నారు.
ఇక్కడ తోటి ఉద్యోగిణితో మరో ఉద్యోగి చనువుగా ఉండటం జరుగుతుంటుంది. అయితే వారి ప్రవర్తన కొంతమందిలో అనుమానం రేకిత్తించేదిగా ఉంటుంది. అయితే వారివారి భాగస్వాములకు అసలు విషయం తెలుసు. కానీ ఇది ఎదుటి వాళ్లకు ఓ పట్టాన అర్థం కాదు.
అందుకే అటువంటి వాళ్లు ఇది ఓ మానసిక వ్యభిచార రుగ్మతగా ప్రచారం చేస్తుంటారు. కానీ వాళ్లకు అర్థమయ్యే రీతిలో దాన్ని విడమరిచి చెప్పగల స్థితిలో ప్లాటోనిక్ లవ్ జంటలు ఉండవు. ఎందుకంటే కోడి భాష కోడికే తెలుస్తుంది. కుక్క భాష కుక్కకే తెలుస్తుంది. మరి ఈ బంధాన్ని ఏమని పిలవాలి అని చాలామంది నిపుణులు తల బద్దలు కొట్టుకుని చివరికి "ఎక్స్‌స్ట్రా మెటీరియల్ ఎఫైర్స్" అని నామకరణం చేసి పారేశారు.
వారి అభిప్రాయాన్నిబట్టి ఈ సంబంధం అవసరాన్ని బట్టి తన రూపురేఖలను మార్చుకుంటుంది. కాలంతో పాటు తన స్వరూపాన్ని మార్చుకుని సాగిపోతుంది. మొత్తమ్మీద ఈ ప్లాటోనిక్ లవ్ సమాజంలో చాలాచోట్ల పెరిగి వృక్షంగా మారిపోయిందంటున్నారు మానసిక నిపుణులు.