రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించనుంది. ‘‘అమరావతి సంక్రాంతి జీవన వారసత్వ సంబరాలు’’ పేరిట అమరావతి వేదికగా జనవరి 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్‌లో సంబరాల నిర్వహణపై ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు.
సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ విజయభాస్కర్, అచార్య అమరేశ్వర్ గల్లా తదితరులు ఈ సమావేశంలో పాల్గొనగా, సంబరాల నిర్వహణకు సంబంధించిన తుది ప్రణాళికను ఖరారు చేసారు. ఈ నేపధ్యంలో మీనా మాట్లాడుతూ సుప్రసిద్ద కూచిపూడి కళాకారులు కోక విజయలక్ష్మి, నాగచైతన్యలు మూడు రోజుల పాటు ప్రదర్శించే కూచిపూడి డాన్స్ బాలెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు.
10వ తేదీన అక్కడి ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో తెలుగు ప్రశస్థి, 12వ తేదీన శ్రీ కృష్ణదేవరాయ తులాభార మండపంలో రైతు రాయల స్వర్ణచరితం, 14వ తేదీన కృష్ణవేణి ఘాట్‌లో అన్నమయ్య పదమంజీర నాదం ప్రదర్శితమవుతాయన్నారు. మరోవైపు 14వ తేదీన డిజిటల్ సౌండ్ అండ్ లైట్ షో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి వేడుకలను తమ శాఖ మరింత శోభాయమానంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తుందని ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
తెలుగు నృత్య రీతుల పట్ల అమరావతి ప్రాంతంలోని వారందికీ అవగాహన కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసామన్నారు. ప్రత్యేకించి కూచిపూడి నృత్యానికి మరింతంగా జనంలోకి తీసుకువెళ్లే క్రమంలో తొలుత అమరావతి మండలంలోని 23 గ్రామాల ప్రజలు, సిఆర్‌డిఎ పరిధిలోని 29 గ్రామాల ప్రజలను సైతం కార్యక్రమాలలో అంతర్భాగం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
అమరావతి ప్రధాన రహదారిలోని జమిందార్ బంగ్లా సమీపంలో ముగ్గుల పోటీలు ఉంటాయన్నారు. ఇక్కడి ఆక్రమణలను తొలిగించాలని ఇప్పటికే స్థానిక తహసీల్దార్‌ను ఆదేశించామన్నారు. ఇవేకాక, హరికథ, బుర్రకథ కాలక్షేపం, కోలాటం, స్థానిక కళాకారులతో అక్కడి రైతుల జీవన స్ధితిగతులను ప్రతిబింబించే నాటకాలు, యోగ ప్రదర్శనలు ఉంటాయన్నారు. ధ్యానబుద్ద సౌండ్ అండ్ లైట్ షోను పూర్తి హంగులతో జనవరి 11వ తేదీన ఆవిష్కరించనున్నామని ఇది పర్యాటకులను, వారసత్వ ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వివరించారు.