అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ బంగారు పతక వేట కొనసాగిస్తున్నాడు. రియోలో హ్యాట్రిక్ స్వర్ణంతో అదరగొట్టాడు. ఫలితంగా ఈ బంగారు చేప కెరీర్‌లో 21వ పసిడిని ఒడిసిపట్టాడు. పోటీలకు ఐదోరోజైన మంగళవారం ఒక్కరోజే రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు. తద్వారా ఈత కొలనులో తనకు ఎదురేలేదని మరోమారు నిరూపించాడు. ఇక అమెరికా ‘సాగరకన్య’ కేటీ లెడెకి కూడా రియోలో రెండో స్వర్ణంతో మెరిసింది. కాగా.. హంగేరీ 'ఐరన్ లేడీ' కాంటికా హోస్జు ఒలింపిక్ రికార్డును బ్రేక్ చేస్తూ ముచ్చటగా మూడో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది.
మంగళవారం రాత్రి జరిగిన పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్, 4X200 మీటర్ల రిలేలో ఫెల్ప్స్ పసిడి పతకాలు సాధించాడు. ఉత్కంఠగా సాగిన 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఫైనల్లో అమెరికా దిగ్గజ స్విమ్మర్ ఫెల్ప్స్ 1:53.36 టైమింగ్‌తో స్వర్ణం ఎగరేసుకుపోయాడు. ఫెల్ప్స్‌కు గట్టి పోటీ ఇస్తాడనుకున్న దక్షిణాఫ్రికా స్విమ్మర్ లీ క్లోజ్ చడ్ (1:54.19) నాలుగో స్థానానికే పరిమితమయ్యాడు. కాగా.. ఫెల్ప్స్‌కు చివరి వరకూ గట్టి పోటీనిచ్చిన జపాన్ స్విమ్మర్ సకాయ్ మసాటో (1:53.40) రజతంతో సరిపెట్టుకున్నాడు. హంగేరీకి చెందిన థామస్ కెండెరెసి (1:53.62) కాంస్యం సాధించాడు.
అలాగే, అమెరికా స్విమ్మింగ్ బ్యూటీ కేటీ లెడెకి రియోలో రెండో స్వర్ణాన్ని ముద్దాడింది. మంగళవారం రాత్రి జరిగిన మహిళల 200 మీటర్ల ఫ్రీ స్టయిల్ ఫైనల్లో టీనేజ్ సంచలనం లెడెకి 1:53.73 టైమింగ్‌తో పసిడి ని ఒడిసిపట్టింది. స్వీడన్ స్టార్ స్విమ్మర్ సారా జోష్రోమ్ (1:54.08) రజతంతో సరిపెట్టుకోగా.. ఆస్ర్టేలియాకు చెందిన ఎమా మెకెయోన్ (1:54.92) కాంస్యం సాధించింది. అంతకుముందు 400 మీటర్ల ఫ్రీ స్టయిల్ విభాగంలో లెడెకి స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.