టోక్యోను వణికిస్తున్న కరోనా వైరస్ - ఒకే రోజు 4 వేల పాజిటివ్ కేసులు

ఆదివారం, 1 ఆగస్టు 2021 (09:48 IST)
జపాన్ రాజధాని టోక్యోను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ నగరంలోనే ఒలింపిక్స్ 2020 క్రీడలు జరుగుతున్నాయి. దీంతో జపాన్ ప్రభుత్వ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఒకే రోజు ఏకంగా 4 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఓవైపు ఒలింపిక్స్ జోరుగా సాగుతుండగా, మరోవైపు కరోనా చాపకింద నీరులా చుట్టుముడుతోంది. శనివారం ఒక్క రోజులోనే  ఏకంగా 4,058 కేసులు నమోదయ్యాయి. రాజధానిలో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూడడం ఇదే తొలిసారి. 
 
దేశవ్యాప్తంగా 10 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఒలింపిక్స్ క్రీడాగ్రామంలోనూ 21 మంది కొవిడ్ బారినపడ్డారు. జులై 1 నుంచి ఇప్పటి వరకు 241 మందికి కరోనా సోకింది. టోక్యోలో ప్రస్తుతం ‘అత్యవసర పరిస్థితి’ అమల్లో ఉంది. తాజా కేసుల నేపథ్యంలో మరో నాలుగు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.
 
మరోవైపు, థాయిలాండ్, మలేషియాలలో డెల్టా వేరియంట్ పడగ విప్పుతోంది. శనివారం థాయిలాండ్‌లో 18,912 మంది, మలేషియాలో 17,786 మంది కరోనా బారినపడ్డారు. థాయిలాండ్‌లో నమోదవుతున్న కేసుల్లో 60 శాతానికి పైగా డెల్టా వేరియంట్‌కు సంబంధించినవే కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు