రియో ఒలింపిక్స్ క్రీడల్లో పెను సంచలనం నమోదైంది. ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు జకోవిచ్ తొలిరౌండ్లోనే నిష్క్రమించాడు. ఈ రౌండ్లో డెల్పోట్రోతో తలపడిన జకొవిచ్ 7-6, 7-6తో ఓటమిపాలయ్యాడు. దీంతో జొకో రియో నుంచి నిష్క్రమించాడు.
మ్యాచ్ అనంతరం జొకో మాట్లాడుతూ, డెల్పెట్రోను తక్కువ అంచనా వేశానని దానికి తగిన మూల్యం చెల్లించుకున్నట్టు చెప్పాడు. ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించడం ఏ ఆటగాడికైనా బాధగానే ఉంటుందని, తాను కూడా చాలా బాధపడుతున్నట్లు వాపోయాడు.
అలాగే, మహిళల డబుల్స్ విభాగంలో అమెరికాకు చెందిన విలియమ్స్ సోదరీమణులకు షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన బార్బోరా స్టికోవా, లుసియా సపరోవా చేతిలో 6-3, 6-4 తేడాతో చిత్తుగా ఓడిపోయి ఇంటిదారి పట్టారు. వీరిద్దరు కలిసి ఆడిన ఒలింపిక్స్ క్రీడల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, ఈ జంట గత 2000, 2008, 2012లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న విషయ తెల్సిందే.