శ్రీలంకపై భారత్ జైత్రయాత్ర : మిస్టర్ కూల్ ధోనీ విజయదరహాసం!
శుక్రవారం, 12 జులై 2013 (09:07 IST)
File
FILE
వెస్టిండీస్ వేదికగా జరిగిన సెల్‌కాన్ ముక్కోణపు టోర్నీలో మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీ మెరుపులు మెరిపించడంతో శ్రీలంకపై భారత్ క్రికెట్ జట్టు మరోమారు విజయం సాధించి, ట్రై సిరీస్ విజేతగా నిలిచింది. కేవలం ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన తరుణంలో మిస్టర్ కూల్ కెప్టెన్ రెచ్చిపోయి రెండు సిక్స్‌లు ఒక ఫోర్ కొట్టడంతో భారత్ విజయభేరీ మోగించింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 48.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయింది. లంక ఓపెనర్లు తరంగా (11), జయవర్దనే (22), సంగక్కర (71), థిరమన్నే (46), మ్యాథ్యూస్ (10)లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఎక్స్‌ట్రాల రూపంలో 23 పరుగులు లంక స్కోరుకు కలిశాయి.
ఆ తర్వాత 202 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా ఆరంభించారు. ధావన్ (16) ఎరాంగె బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌తో వెనుదిరిగడంతో భారత్ వికెట్ల పతనం ఆరంభమైంది. మరో రెండు ఓవర్లకు రెండు పరుగులు జోడించి కోహ్లీ (2) కూడా ఎరంగా బౌలింగ్‌లోనే సంగక్కర చేతికి చిక్కాడు.
ఆ తర్వాత రోహిత్, కార్తీక్ చాలా రక్షణాత్మకంగా ఆడుతూ మొదటి 50 పరుగులు చేయడానికి 108 బంతులు తీసుకున్నారు. 23వ ఓవర్‌లో జట్టు 77 పరుగుల వద్ద కార్తీక్ (23) హెరాత్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న జయవర్దనే అందుకున్న క్యాచ్‌తో డ్రెస్సింగ్ రూమ్‌కు చేరాడు.
ఈ దశలో రోహిత్, రైనాతో కలిసి నాలుగో వికెట్‌కు 62 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అర్థ సెంచరీ చేసి నింపాదిగా ఆడుతున్న రోహిత్ (58) హెరాత్ విసిరిన బంతి చాలా తక్కువ ఎత్తులో వచ్చి వికెట్లను ముద్దాడింది. మరికొద్దిసేపటికే సురేష్ రైనా (32)ను లక్మల్ బోల్తా కొట్టించి కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అప్పటికి భారత్ స్కోరు 145/5. ఒక ఎండ్‌లో ధోనీ క్రీజ్‌లో ఉండగా, మరో ఎండ్‌లోకి వచ్చిన ఏ బ్యాట్స్‌మెన్ కూడా సహకరించలేక పోయారు. మ్యాచ్ 37వ ఓవర్ మొదటి రెండు బంతుల్లో హెరాత్ వరుసగా జడేజా (5), అశ్విన్ (0)లను వికెట్ల తీసి మ్యాచ్‌ను తమ వైపుకు తిప్పుకున్నాడు. అప్పటికి ఇంకా జట్టు విజయానికి 50 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి.
ఈ దశలో నింపాదిగా ఆడిన ధోనీ.. చెత్త బంతి వచ్చినపుడల్లా బౌండరీలైన్ దాటిస్తూ... లక్ష్యానికి చేరువయ్యాడు. అయితే, 21 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా ధోనీకి పూర్తి సహకారం అందిస్తూ వచ్చిన భువనేశ్వర్‌ను మలింగ ఎల్‌బిడబ్ల్యూగా సాగనంపడంతో భారత్ ఓటమి ఖాయమని అందరూ భావించారు.
అయితే, 9వ వికెట్‌గా వచ్చిన వినయ్ కుమార్‌కు స్ట్రై ఇవ్వకుండా ఆడదామని భావించిన ధోని వ్యూహం ఫలించలేదు. 26 బంతుల్లో 21 బంతులకు వినయ్ కుమార్‌కే స్ట్రైక్ వచ్చింది. జట్టు పరుగులు 182 వద్ద మాథ్యూస్ బౌలింగ్‌లో షార్ట్ థర్డ్ మ్యాన్ వద్ద సబ్‌స్టూట్ ఫీల్డర్ సేనయకే అందుకున్న సులభమైన క్యాచ్‌తో వినయ్ కుమార్ (5) వెనుదిరిగాడు.
ఈ దశలో 23 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. ఆ తర్వాత 12 బంతుల్లో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. చివరికి రెండు ఓవర్లలో 17 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇషాంత్ శర్మ ఒక ఓవర్ ఆడి రెండు పరుగులు మాత్రమే చేశాడు. ఈ దశలో రెండు సార్లు రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
ఇక మిగిలింది మ్యాచ్ చివరి ఓవర్. ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉంది, ఓవర్ స్ట్రైక్ ధోనీకి వచ్చింది. మొదటి బంతి డాట్. రెండో బంతిని బౌలర్ తలపై నుంచి సిక్స్‌గా మిలిచాడు. మూడో బంతి ఫోర్. నాలుగో బంతి మరో సిక్సర్. అంతే భారత్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. మరో రెండు బంతులు మిగిలివుండగానే ధోనీ సేన విజయాన్ని అందుకుంది. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు ధోని అందుకోగా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును యువకెరటం భువనేశ్వర్ కుమార్‌కు లభించింది.