బక్కోడిని కొట్టేందుకు సైంధవుడిలా వచ్చారు.. చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి

బుధవారం, 12 డిశెంబరు 2018 (13:25 IST)
కేసీఆర్ అనే బక్కోడిని కొట్టేందుకు అంతమందా? అంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సైంధవుడిగా వచ్చారు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టారు. సైంధవుడు-2గా లగడపాటి రాజగోపాల్‌ వచ్చారు. అయినా కేసీఆర్‌ చేసిన సంక్షేమమే ఆయనను గెలిపించిందన్నారు. కేసీఆర్‌ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలన్నారు. 
 
మంగళవారం వెలువడిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌కు కేసీఆర్ వెళ్లి చంద్రబాబుకు రిటర్న్ గిప్టు ఇవ్వాలన్నదే తన కోరిక అని అన్నారు. తాను ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసినపుడు తాను గెలవాలని దేవుడుని ప్రార్థించలేదనీ, కానీ ఈ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపునకు మాత్రం అనేకమంది దేవుళ్ళకు మొక్కుకున్నట్టు ఆయన తెలిపారు.
 
ఒక్క బక్కోడిని కొట్టేందుకు అంతమందా అంటూ ప్రశ్నించారు. నిజానికి గద్దర్‌ అంటే తనకు ఎంతో అభిమానమని, అలాంటి వ్యక్తి కాంగ్రెస్‌తో కలిసి ప్రచారం చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. సెటిలర్లను సైతం తెలంగాణ బిడ్డలుగా కేసీఆర్‌ చూసుకున్నారని, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ అధికారంలోకి రావడం ఖాయమని పోసాని జోస్యం చెప్పారు. 
 
అంతేకాకుండా, తెలంగాణ ప్రజలు కులపిచ్చితో కాకుండా సీఎం కేసీఆర్‌ సంక్షేమాన్ని చూసి ఓట్లేశారన్నారు. ఇదే విధంగా ఆంధ్రాలో ఉన్న కమ్మవారు.. మంచి నిజాయితీ ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
కేసీఆర్‌ ఏం చెప్పాడో ఆ మంచి పనులను చేశారు. కాళేశ్వరం పూర్తైతే సగం తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి, మూడేళ్లలో ప్రజలకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆరే. ఆయనపై చేసిన విమర్శలను ప్రజలు తిప్పికొట్టారు. ఏపీలో తహసీల్దార్‌పై దాడి జరిగితే చంద్రబాబు పట్టించుకోలేదు. అదే కేసీఆర్‌ అనాథ బాలికకు అన్యాయం జరిగితే న్యాయం చేశారు. 
 
జగన్‌పై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు పరామర్శించలేదు. కనీసం పలకరించలేదు కదా.. జగన్‌ కుటుంబంపై ఎదురు దాడి చేశారు. బాలకృష్ణ అంత పవర్‌‌ఫుల్‌ అయితే సుహాసిని గెలిచి ఉండేది. లగడపాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం. కేసీఆర్‌, కేటీఆర్‌ల్లో సీఎం ఎవరైనా మంచి పాలన అందిస్తారని పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు