ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై... తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ వరకూ ఇంటింటా సంబురాలు సాగనున్నాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో పూల పండుగను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
అన్ని జిల్లా కేంద్రాలు, డివిజన్, మండల కేంద్రాల బతుకమ్మ ఉత్సవ ప్రాంగణాల వద్ద, నిమజ్జనాలు జరిగే చెరువులు, కుంటల వద్ద విద్యుత్ దీపాల అలంకరణలతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్, పీపుల్స్ ప్లాజా, ఇతర ప్రధాన ప్రాంతాలు, కూడళ్లలో అలంకరణలు చేపట్టారు.
తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, ఆ తర్వాతి రోజుల్లో అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు, నానేబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయ, వెన్నముద్దల బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు.