కరోనా సోకిన గర్భిణి.. ఆంబులెన్స్‌లోనే ప్రసవం.. పండంటి పాప పుట్టిందోచ్..

బుధవారం, 29 జులై 2020 (11:57 IST)
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఈ క్రమంలో కరోనా సోకిన నిండుగర్భిణీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే 108 వాహనంలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన 9 నెలల గర్భిణికి కరోనా సోకింది. దీంతో ఆమె డెలివరీ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే నుంగనూరుకు చెందిన 108 సిబ్బంది ఆమెను హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. 
 
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట వద్దకు వెళ్లే సరికి ఆమెకు పురిటి నొప్పులతో మరింత ఎక్కువ కావడంతో 108 సిబ్బంది డెలివరీ చేశారు. దీంతో ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను అదే వాహనంలో హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు