మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ : సీఎం కేసీఆర్ ఆదేశాలు

సోమవారం, 3 మే 2021 (09:35 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌ అయ్యారు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను తొలగిస్తున్నట్టు గవర్నర్‌ కార్యాలయం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. 
 
ఈటలపై వచ్చిన ఆరోపణలపై సీఎం ఆదేశాల మేరకు విచారించిన కమిటీ.. తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈటల భూ ఆక్రమణ నిజమేనని అందులో నిర్ధారించింది. విజిలెన్స్‌ అధికారులు కూడా ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించారు. వీటి ఆధారంగానే సీఎం కేసీఆర్‌ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను తొలగించాలని నిర్ణయించి, గవర్నర్‌కు సిఫారసు చేశారు. 
 
గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఈటలను బర్తరఫ్‌ చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీచేశారు. 2014లో తొలిసారి ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ టి.రాజయ్య కూడా పలు ఆరోపణల నేపథ్యంలోనే బర్తరఫ్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ కూడా బర్తరఫ్‌కు గురికావడం గమనార్హం.
 
ఇదిలావుండగా, ఈటల రాజేందర్‌ ఆక్రమణల పర్వం ఆధారాలతో సహా రుజవైంది. ఈటల, ఆయన అనుచరులు మెదక్‌ జిల్లా మాసాయిపేట మండటం అచ్చంపేట, హకీంపేటలో ఏకంగా 66.01 ఎకరాలు చెరబట్టారని ప్రత్యేక కమిటీ తేల్చింది. 
 
బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేద రైతులను బెదిరించి వారి భూములను గుంజుకున్నారని ఈటలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిపై విచారణకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఏర్పాటుచేసిన విచారణ కమిటీ తన నివేదికను సమర్పించింది. 
 
ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. సీఎస్‌ ఆదేశాలతో మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌, విజిలెన్స్‌ ఎస్పీ మనోహర్‌ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ శనివారం బాధిత గ్రామాల్లో పర్యటించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు