చైత్ర ఘటన.. పవర్ పరామర్శ.. షర్మిల దీక్ష.. దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ర్యాలీ..
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (23:07 IST)
హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణలో చిన్నారి చైత్ర ఘటనపై ఆందోళనలు అధికమవుతున్నాయి. ఈ ఘటన జరిగి వారం కావొస్తున్నా నిందితుడిని ఇంకా పట్టుకోకపోవడంపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఇంట్లోంచి బయటకు వెళ్లిన చిన్నారిని దారుణంగా హత్యచేయడం దుర్మార్గమని పవన్ కల్యాణ్ అన్నారు.
మరోవైపు సైదాబాద్‌లో చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల చేస్తున్న దీక్ష కొనసాగుతోంది. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించే వరకూ దీక్ష చేస్తానని షర్మిల బుధవారం దీక్షకు కూర్చున్న సంగతి తెలిసిందే.
చిన్నారి ఇంటి సమీపంలో మధ్నాహ్నం నుంచి దీక్ష కొనసాగుతోంది. చంపాపేట వద్ద సాగర్ రోడ్డుపై వైఎస్సార్టీపీ కార్యకర్తలు కూడా బైఠాయించారు. దాంతో చంపాపేట్, కర్మన్‌ఘాట్ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.
sharmila
అలాగే చిన్నారి తల్లిదండ్రులను వైఎస్ విజయమ్మ పరామర్శించి.. ఓదార్చారు. అనంతరం షర్మిల చేపట్టిన దీక్షకు వైఎస్ విజయమ్మ సంఘీభావం తెలిపారు. అలాగే మహిళా సంఘాలు సైతం చైత్ర ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అలాగే నిందితుడి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో చిన్నారి చైత్రను కడతేర్చిన నిందితుడు రాజాను శిక్షించాలని దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ వంశీ ప్రియ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొవ్వొత్తులతో బీరంగూడ గుట్ట కమాన్ నుంచి రాఘవేంద్ర కాలనీ గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించి నివాళి అర్పించారు.
Disha
ఈ ర్యాలీలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పసిపాప నుంచి మహిళల వరకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
మనదేశంలో కఠినమైన చట్టాలు లేకపోవడంతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు. దేశంలో మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ వార్డ్ కౌన్సిల్సర్స్, సునీత, లావణ్య పద్మావతి తదితరులు పాల్గొన్నారు.