'గ్రేటర్' గెలుపు మా అన్న ఫలితమే.. కేసీఆర్ వారసుడు కేటీఆరే.. హరీష్ కాదు: కవిత

ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (10:03 IST)
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస పార్టీకి లభించిన విజయం తన అన్న, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కృషి ఫలితమేనని, ఈ స్థాయిలో సీట్లు రావడాన్ని చూసి తాము కూడా ఆశ్చర్యపోయామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పుకొచ్చారు. అందుకే సీఎం కేసీఆర్‌ రాజకీయ వారసుడు కేటీఆరేనని తేల్చి చెపుతూ.. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కాదనే విషయాన్ని ఆమె తన మాటల ద్వారా వ్యక్తీకరించారు. 
 
గ్రేటర్ విజయంపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయానికి సీఎం కేసీఆర్‌ సమర్థ పాలన, వివిధ ప్రజోపయోగ పథకాలే కారణమన్నారు. గ్రేటర్‌లో ఈ స్థాయిలో వచ్చిన సీట్లను చూసి తాము కూడా ఆశ్చర్యానికి గురయ్యామని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలకు ఏ స్థాయిలో ఆశలు ఉన్నాయో అర్థమైందన్నారు. 
 
వచ్చే 2019 సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ ఇదే స్థాయిలో సత్తాచాటుతుందని ఆమె ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీలను ప్రజలు నమ్మలేదని, అందుకే అవి ఘోరంగా ఓడిపోయాయని చెప్పారు. 'ప్రతిపక్ష పార్టీలు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. బాధ్యత లేకుండా మాట్లాడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి' అని హెచ్చరించారు. ఇకపోతే.. మజ్లిస్‌తో సంద ర్భానుసారంగా సంబంధాలను కొనసాగిస్తామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి