తెలంగాణ రాష్ట్రం దండుమైలారంలోని హఫీజ్‌పూర్ భూముల వ్యవహారం విషయంలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు వెనక్కి తగ్గారు. ఈ భూముల కొనుగోలు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఆయన యూటర్న్ తీసుకున్నారు. భూముల కొనుగోలు కోసం తాను చెల్లించిన డబ్బును వడ్డీతో సహా చెల్లిస్తే భూములు తిరిగి అప్పగిస్తేనని ఆయన తెలిపారు.
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకే వివాదాస్పద గోల్డ్‌స్టోన్ సంస్థ నుంచి భూములు కొనుగోలు చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. తొలుత ఈ భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేస్తే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పిన కేకే.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఈ భూములు సక్రమమో, అక్రమమో గానీ, వివాదంలో ఉన్న భూములు కొని తాను నష్టపోయానని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ మురికి డీల్ కోసం తాను తమ ప్రభుత్వంతోను, తమ నాయకుడితోను పోరాడలేనని చెప్పారు. ఈ మురికి డీల్ వదులుకోవాలని తమ కుటుంబ సభ్యులమంతా కలిసి నిర్ణయించామన్నారు. ఈ భూముల సేల్ డీడ్‌ను రద్దు చేయాలని తానే కోర్టును కోరతానన్నారు. వివాదాస్పద భూములను అమ్మిన విల్టేజ్ గ్లోబల్‌మీడియా సంస్థకు లీగల్ నోటీసు పంపించి తనకు జరిగిన నష్టపరిహారాన్ని వడ్డీతో సహా రాబడతానన్నారు.