తెలంగాణ రాష్ట్ర సమితిలో మూడవ తరానికి మెరుగులద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడుతోంది. తెలంగాణ సెంటిమెంట్‌తో జనాన్ని పోగేసుకొనేసి... రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వెనుకబడిన తరగతులకు చెందిన వాడిని ముఖ్యమంత్రిగా చేస్తానని మాట ఇచ్చి తప్పిన కేసీఆర్... అప్పటి నుండే తన కుటుంబాన్ని బాగా ప్రొమోట్ చేసేసుకోవడం మొదలెట్టాడు... కొడుకుకి ఐటీ పరిశ్రమ.. మేనల్లుడికి భారీ నీటి పారుదల శాఖల మంత్రి పదవులతోపాటు కూతురికి ఎంపీ టిక్కెట్లు కట్టబెట్టేసిన ఆయన తర్వాత వచ్చిన విమర్శలకు జడిసారో ఏమో గానీ... రెండవసారి అధికారం చేపట్టాక కొడుకు చేతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పి మేనల్లుడికి మొండిచేయి చూపారు.
అయితే ఇప్పుడు ఆ కుటుంబం నుండి కొత్తగా మూడో తరానికి ప్రమోషన్ చక్కగా రూపొందించుకుంటున్నారనే విమర్శలు బాహాటంగానే వినపడుతున్నాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నిర్వహించిన బెహతర్ ఇండియా వాతావరణ్ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పర్యావరణ విభాగం పోటీలలో భాగంగా... ఎక్కువ స్థాయిలో రీసైక్లింగ్ వ్యర్థాలను సేకరించిన వారికి అందజేసే పతకాలలో సదరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గారు అదేనండీ.. మన కేటీఆర్‌గారి కుమారుడు కేసీఆర్‌గారి మనవడు హిమాన్షు రావు జాతీయ పర్యావరణ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించారు.
ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న హిమాన్షు రావు 29,482 కిలోల రీసైక్లింగ్ వ్యర్థాలను సేకరించి జాతీయస్థాయిలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడట. హిమాన్షు తన పాఠశాల, ఇరుగుపొరుగు వారి నుండి పాత వార్తా పత్రికలు, రాత పుస్తకాలు తదితర రీసైక్లింగ్ సామగ్రిని సేకరించడంతో సంస్థ నిర్వాహకులు అతడికి గోల్డ్ మెడల్ ప్రకటించేసారు. కాగా... పాఠశాలల విభాగంలో ఓక్రిడ్జ్ స్కూల్ 34,137 కేజీల వ్యర్థాలను సేకరించి జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచి రజత ట్రోఫీని అందుకుంది.