వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగైనా ఉంటాగానీ ఆ పని మాత్రం చేయను... : రాజాసింగ్

బుధవారం, 1 మార్చి 2023 (09:19 IST)
హైదరాబాద్ నగరంలోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆయనను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. దీంతో ఆయన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆయన్ను అరెస్టు కూడా చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలపై ఆయన స్పందించారు. 
 
వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీ అధిష్టానం తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తి వేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందువల్ల బీజేపీ అభ్యర్థిగానే మళ్లీ బరిలోకి దిగుతానని చెప్పారు. ఒకవేళ సస్పెన్షన్ ఎత్తివేయకపోతే మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా కూడా తాను పోటీ చేయబోనని ఆయన తేల్చి చెప్పారు. 
 
దీనికి కారణం లేకపోలేదన్నారు. తాను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు వీరాభిమానినని చెప్పారు. అందువల్ల పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ పని చేయనని చెప్పారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో సహా పార్టీలోని పెద్దల ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు. 
 
కాగా, గోషామహల్ నుంచి రాజాసింగ్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. తెరాస కారు జోరును తట్టుకునిమరీ ఆయన గెలుపొందారు. అయితే, ఇపుడు ఆయనపై పార్టీ బహిష్కరణ వేటు వేయడంతో వచ్చే ఎన్నికల్లో గోషామహల్ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న అంశంపై ఇప్పటి నుంచే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు