సికింద్రాబాద్ జీఆర్‌పీ ఎస్పీ జనార్ధన్ వెల్లడించిన వివరాల మేరకు ఈ నెల ఐదో తేదీన దుర్గ అనే బాలికను ఓ మహిళ ఎత్తుకెళ్లినట్టు సీసీ ఫూటేజీలో తేలింది. దీంతో నిందురాలిని పట్టుకొని బాలికను క్షేమంగా తల్లివద్దకు చేర్చారు. అయితే, ఈ నిందితురాలి వద్ద పోలీసులు జరిపిన విచారణలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది.
మెదక్ జిల్లా జిన్నారంలోని బాలాజీనగర్‌కు చెందిన బొంతల కుమార్ (24) సికింద్రాబాద్ రైల్వే, బస్టేషన్‌ల వద్ద కాపు కాసి ఇంటి నుంచి పారిపోయి వచ్చే యువతులు, చిన్నారులను గుర్తిస్తాడు. ఇలా గుర్తించిన యువతుల గురించి తమ ముఠాలోని మరో సభ్యురాలు పద్మావతి అలియాస్ సునీత (26)కు తెలియజేస్తాడు. ఆమె రంగంలోకి దిగి ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ట్రాప్ చేస్తుంది. అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఒంటరిగా ఉండే బాలికలను కిడ్నాప్ చేస్తుంది. వీరిని ఎవరూ గుర్తు పట్టకుండా గుండు గీయిస్తారు.
ఆ తర్వాత ట్రాప్ చేసిన అమ్మాయిలతో పాటు చిన్నారులను యాదగిరిగుట్ట సుభాష్‌నగర్‌కు చెందిన కంసాని శంకర్ (51)కి విక్రయిస్తారు. శంకర్ తన భార్య దివ్య సహకారంతో వ్యభిచార గృహాలు నడిపే కోడెం బేగమ్మ (60), మేకల బూస (55), చింతల కమలమ్మ (48)లకు వారిని మళ్ళీ కొంత మొత్తానికి విక్రయిస్తాడు.
అనంతరం యువతులతో ప్రతి రోజూ వ్యభిచారం చేయిస్తుంటే అందులో వచ్చిన డబ్బులో కొంత కమిషన్ పుచ్చుకోవడం జరుగుతూ వస్తోంది. ఇక చిన్న పిల్లలనైతే పెంచి పెద్ద చేసి అనంతరం వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నట్టు తేలింది. వీరంతా యాదగిరిగుట్టను అడ్డాగా చేసుకుని, వివిధ జిల్లాల్లో వ్యభిచార గృహాలు నడిపిస్తున్నట్టు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. దీనిపై వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.