జీవితానికి శుభం పలికే స్వేచ్ఛ మనకుంది సరే. ఒకరి తర్వాత ఒకరు ఇలా పోతే ఎలా?

బుధవారం, 5 జులై 2017 (09:28 IST)
జీవితం సాగించే పరిస్థితులు కనుచూపుమేరలో కనపడనప్పుడు తన జీవితాన్ని తానే ముగించుకునే హక్కు  వ్యక్తికి ఉంటుందేమో కానీ చట్టం ఏమాత్రం ఒప్పుకోదు. అయినా సరే ఆత్మహత్యలు అలవాటుగా మారుతున్న దేశంలో ఎవరు ఎందుకు ఏకారణంతో ఆత్మహత్యలకు, ఆత్మహననాలకు పాల్పడుతున్నారో ఎవరూ కారణాలు చెప్పలేరు. కానీ జీవితాన్ని చేతులారా ముగించుకోవడం ఆత్మ బలిదానం కిందికే వస్తుందా.  
 
జీవితంపై విరక్తి పొంది ఒక యువకుడు ఉరిపోసుకుని జీవితం చాలిస్తే మేనమామ లేని ప్రపంచం నాకెందుకు అనే వ్యధతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని సజీవ దహనమైంది  అతడి బంధువు. జీవితంపై ఇష్టం కోల్పోయిన వాడి మరణం ఒకటైతే తానెంతో ఇష్టపడే అతడు దూరం కావడం  తట్టుకోలేని యువతి నాకెందుకీ జీవితం అంటూ అగ్ని కీలల సాక్షిగా ప్రపంచం నుంచి తప్పుకోవడం  మన సమాజంలో మన కళ్లముందు జరుగుతున్న బీభత్స ఘటనల్లో ఒకటిగా మారిపోయింది. ఎందుకిలా జరుగుతోంది అంటే ఏ సామాజిక శాస్త్రజ్ఞులు కూడా సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు. భావోద్వేగాలే మనుషులను అర్ధాంతర మరణాల వైపుకు నెడుతున్నాయా?
 
మేనబావ అంటే ఆమెకెంతో ఇష్టం.. కానీ అనుకోకుండా అతడు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ యువతి తట్టుకోలేక పోయింది. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని జన్నెపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై రవీందర్‌నాయక్‌ కథనం ప్రకారం.. జన్నెపల్లికి చెందిన బోడ శ్రీనివాస్, వాణి దంపతులకు కొడుకు నాగరాజు, కూతురు నందిని (19) ఉన్నారు. నందిని ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేసి, డిగ్రీలో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంది.
 
నందిపేట మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన మేనబావ రచ్చ సాయికుమార్‌ అంటే ఆమెకెంతో ఇష్టం. అయితే, సాయికుమార్‌ జీవి తంపై విరక్తి చెంది సోమవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం నంది పేటలో జరిగిన అంత్యక్రియలకు నం దిని తల్లిదండ్రులు వెళ్లారు. అయితే, మేనబావ మృతితో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె.. ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. 
 
పూర్తిగా కాలిపోయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే, ఇంటి నుంచి పొగలు రావడంతో గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు.. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
 

వెబ్దునియా పై చదవండి