ప్రభుత్వాలు ఎన్ని రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు. దీనికి కారణం అనేకమంది పాజిటివ్ రోగులు హోం ఐసోలేషన్‌లో ఉండకుండా బయటతిరుగుతున్నారు. ఈ క్రమంలో దొంగలను, నేరస్థులను గుర్తించేందుకు పోలీసులు జాగిలాలను వాడుతుంటారు. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులను కూడా గుర్తించేందుకు శునకాలు బాగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కుక్కలకు సరైన శిక్షణ ఇస్తే లక్షణాలు లేనటువంటి రోగులను కూడా గుర్తించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
విమానాశ్రయాల్లో అరైవల్స్ వద్ద శునకాల వల్ల చాలా మంది రోగులకు ఈజీగా గుర్తించవచ్చు అని లండన్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ తన అధ్యయనంలో తేల్చింది. శునకాల్లో ఉండే వాసన పసికట్టే గుణం అత్యం కీలకమైందని పరిశోధకులు చెబుతున్నారు. కేన్సర్, మలేరియా, ఎపిలెప్సీ వంటి వ్యాధి గ్రస్తులను ఇప్పటికే కుక్కలు గుర్తిస్తున్నట్లు నివేదికలో చెప్పారు.
సార్స్ సీవోవీ2 వైరస్ సోకి పాజిటివ్‌గా తేలిన వ్యక్తిలో ఉన్న స్వల్ప లక్షణాల వల్ల వచ్చే స్మెల్‌తో కుక్కలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. కోవిడ్ రోగులు వాడిన దుస్తులు, ఫేస్ మాస్క్‌లను వాసన ద్వారా పసికట్టే రీతిలో శునకాలకు ట్రైనింగ్ ఇచ్చారు. సుమారు 200 మంది కోవిడ్ రోగులు ధరించిన సాక్సులను ఆరు శునకాల ద్వారా ల్యాబ్‌లో పరీక్షించారు.
విమానాశ్రయాల్లో టెర్మినల్స్ వద్ద కుక్కులు సుమారు 91 శాతం పాజిటివ్ కేసులను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఇది పీసీఆర్ పరీక్షలతో పోలిస్తే 2.24 శాతం మాత్రమే తక్కువ అని అన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో అరైవల్స్ వద్ద పాజిటివ్‌గా దొరికిన వ్యక్తులకు అదనంగా పీసీఆర్ టెస్టులు చేయవచ్చు అని, దాని ద్వారా క్వారెంటైన్ నియమావళి ఈజీ అవుతుందని పరిశోధకులు చెప్పారు.