సింగరేణి ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. రిటైర్డ్ అయిన వారికి మళ్లీ ఉద్యోగం

సోమవారం, 26 జులై 2021 (18:30 IST)
సింగరేణి ఉద్యోగులకు ఇది నిజంగానే శుభవార్త. పదవీవిరమణ చేసిన వారికి మళ్లీ ఉద్యోగ అవకాశం కల్పించింది సింగరేణి సంస్థ.  అలాగే, తమ ఉద్యోగులు, కార్మికుల పదవీవిరమణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పదవీవిరమణ వయసు 61 ఏళ్ల పెంపునకు సోమవారం జరిగిన 557వ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది. 
 
సీఎండీ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ బోర్డు సమావేశంలో సింగరేణి డైరెక్టర్లతో పాటు కేంద్ర, రాష్ట్రాల నుంచి బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది. గతంలో ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏళ్లు ఉండగా.. తాజాగా 61 ఏళ్లకు పెంచగా, దీనికి బోర్డు ఆమోదముద్ర వేసింది. .
 
ఈ ఏడాది మార్చి 31 నుంచి ఉద్యోగులకు పదవీ విరమణ పెంపు అమలు చేయనున్నారు. దీనివల్ల 43,899 మంది లబ్ధి చేకూరనుంది. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సింగరేణి బోర్డు నిర్ణయించింది. 2021-22 ఏడాదికి సీఎస్‌ఆర్ ఫండ్‌ కోసం రూ.61 కోట్లు కేటాయించింది. 
 
మరోవైపు సింగరేణి నిర్వాసిత కాలనీలకు సంబంధించి 201 ప్లాట్లు కేటాయించాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా కారణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇప్పటివరకు కేవలం కుమారులకు, అవివాహిత కుమార్తెలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. 
 
అయితే, కార్మికుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు పెళ్లయిన, విడాకులు తీసుకున్న విశ్రాంత ఉద్యోగిపై ఆధారపడి ఉన్న కుమార్తెలు, ఒంటరి మహిళలకు కూడా ఉద్యోగ వయోపరిమితికి లోబడి వారసత్వ ఉద్యోగం పొందేందుకు బోర్డు ఆమోదం పలికింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు