తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఇంకా రెండు రోజుల పాటు అతి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఒడిసా, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తమిళనాడు తీరంలో మరో ఆవర్తనం ఉంది.
వీటి ప్రభావంతో సోమవారం కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి.
వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సోమవారం గాంగెటిక్ పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఉండి, సముద్ర మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల వరకు కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం రాత్రి, మంగళవారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.