ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత గెలుపు.. తెరాస మంత్రుల్లో టెన్షన్.. టెన్షన్!

సోమవారం, 12 అక్టోబరు 2020 (12:56 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కె. కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె విజయదుంధుబి మోగించారు. ఆమె తన ప్రత్యర్థులను చిత్తుగా ఓడించారు. ఆమె గెలుపు కోసం మంత్రులతో పాటు... స్థానిక నేతలు ముమ్మరంగా కృషి చేశారు. అయితే, ఆమె విజయం సంగతి పక్కనబెడితే... మంత్రులకు మాత్రం సరికొత్త టెన్షన్ పట్టుకుంది. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత విజయం సాధిస్తే ఆమెను తన మంత్రివర్గంలో సీఎం కేసీఆర్ తప్పక స్థానం కల్పిస్తారన్న ప్రచారం ఆది నుంచి జరుగుతోంది. ఇపుడు కవిత గెలవడంతో మంత్రుల్లో సరికొత్త టెన్షన్ మొదలైంది. 
 
వాస్తవానికి ప్రస్తుతం తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు మంత్రి పదవులకు సంఖ్య సరిగ్గా సరిపోయింది. మంత్రులుగా కేవలం 17 మందికి మాత్రమే అవకాశం ఉంది. 17 మంది మంత్రులూ ఉన్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో కవితను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే, ఎవరినో ఒకరిని తొలగించాల్సిందే. ఇదే ఇప్పుడు తెలంగాణ మంత్రుల్లో కొత్త గుబులును రేకెత్తిస్తోందని రాజకీయ విశ్లేషకులు చర్చలు ప్రారంభించారు.
 
కవితను మంత్రిగా తీసుకోవాలంటే, ఒకరిని తీసివేయక తప్పదు. కవిత కోసం ఎవరైనా తన పదవికి త్యాగం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెరాస వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి తాజాగా ఎమ్మెల్సీగా గెలిచిన కవితకు కేవలం 15 నెలల పదవీ కాలం మాత్రమే ఉంది. 
 
కానీ, ప్రభుత్వం ఇంకో నాలుగేళ్లు ఉంటుంది. అయితే, ఈ 15 నెలల పదవీకాలం తర్వాత, మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యే, లేదా ఎమ్మెల్సీగా గెలవడానికి ఆమెకు ఇంకో ఆరు నెలల సమయం ఉంటుంది. అంటే, దాదాపు మూడు నెలలు తక్కువ రెండేళ్ల పాటు కవిత మంత్రి పదవిలో కొనసాగవచ్చు. 
 
ఆ తర్వాత మళ్లీ ఎమ్మెల్సీగానో, ఎమ్మెల్యేగానో ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎవరిపై వేటు పడుతుందన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. 
 
ఇదిలావుండగా, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం కేసీఆర్ ముందు పెను సవాలు ఉన్నట్టేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఎవరినైనా తప్పిస్తే, కేసీఆర్ విమర్శలను ఎదుర్కోక తప్పదు. అదికాకుంటే, తన సామాజిక వర్గం లేదా, మరో ఉన్నత వర్గం నుంచి ఎవరినైనా తప్పించాలి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై సర్వత్ర చర్చ జరుగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు