నైన్త్‌క్లాస్‌లో ప్రేమా...? తెలుగు సినిమా పరువు తీయకండి

WD
ప్రేమకథలు వింతపోకడలుపోతున్నాయి. అందుకు తాజా ఉదాహరణే.. బుధవారంనాడు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన "నైన్త్‌క్లాస్ కేరాఫ్ ఏలేశ్వరం" చిత్రం. పైగా ఈ చిత్రాన్ని 9వతేదీ 9వ నెల 2009 సంవత్సరం.. ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ప్రారంభించామని, ఇది అద్వితీయ లఘ్నమని చిత్ర దర్శక నిర్మాత ఎం. రాజ్‌కుమార్ చెబుతున్నారు.

ఈ రోజు చాలా సినిమాల ఓపెనింగ్స్ జరగాల్సింది. కానీ జరగలేదు. కారణమేమిటని ఆరా తీస్తే ఎన్ని 9లు వచ్చినా ఈ రోజు మంచిరోజు కాదనేది కొందరు సినీ పండితుల వాదన.

ఇదే రోజున ప్రారంభమైన "నైన్త్‌క్లాస్ కేరాఫ్ ఏలేశ్వరం" విశేషమేమిటంటే..? ఈ చిత్రం ప్రారంభోత్సవంలో దర్శకనిర్మాత పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి వచ్చింది. టెన్త్‌క్లాస్ అనేపేరుతో వచ్చిన ప్రేమకథే సరైంది కాదని, దానివల్ల పిల్లలు పెడదోవ పడుతున్నారని ఇండస్ట్రీ భావిస్తుంటే.. ఏకంగా 9వ తరగతిలో జరిగే ప్రేమకథను సినిమాగా తీయడం ఎంతవరకు సమంజసమని విలేకరులు అడుగారు. దీనికి ఆయన సమాధానం చెపుతూ... లవ్‌ఉన్నా అది నామమాత్రమేననీ.. ఈ చిత్రాన్ని ఓ సందేశం కోసం తీస్తున్నామనీ వివరణ ఇచ్చారు. అయినా దీంతో తృప్తిపడని విలేకరులు.. కాసేపు ఈ సినిమాపై ఎవరికితోచిన విధంగా వారు చర్చించారు.

మైనర్ బాలబాలికలను పెట్టి సినిమాలు తీస్తూ.. పిల్లల్ని చెడగొట్టకండని హితవు పలికారు. ఇటువంటి చిత్రాలు తీసి తెలుగు సినిమా పరువు తీయకండని చురకవేశారు.

ఇందులో మరో విశేషమేమిటంటే..? ఈ చిత్రానికి సమర్పకుడు ఎవరో తెలుసా? మాజీ మంత్రి డా. ఎ. చంద్రశేఖర్. ఇది తెలిసి మైనర్ బాలబాలికల "లవ్ ఏలేశ్వరం" ఏంటండీ అని ఆయనను అడిగితే.. సందేశం కోసమే సినిమా తీస్తున్నామనీ, ఇందులో తప్పేమీ లేదని అన్నారు. ఏది ఏమైనా ఇటువంటి చిత్రాలు రావడం ఇండస్ట్రీకి మంచి పరిణామం కాదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఎన్ని 9లు వచ్చినా నేడు మంచిరోజు కాదనే వాదనను అధిగమించి ఈ సినిమా ప్రారంభించడంతోనే ఆదిలోనే హంసపాదు తరహాలో విలేకరుల నుంచి ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి రావడంతో 09-09-09 నెగటివ్ ఎఫెక్ట్ ఇస్తుందని తేలిపోయింది. మరి మీరేమంటారు?

వెబ్దునియా పై చదవండి