కమల్ హాసన్ ముఖ్యమంత్రిపై పీఠంపై కన్నేశాడా??

బుధవారం, 19 జులై 2017 (12:19 IST)
కొంతకాలంగా తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యత మూలంగా, తమిళీ సినీ తారలు రాజకీయాల్లో ప్రవేశించి వెలుగు వెలిగిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. పాతతరం సినీ నటులు ఎంజీఆర్, జయలలిత మాదిరిగా చక్రం తిప్పాలని కలలు కంటున్నారు. ఇటీవల రాజకీయాల్లోకి రావచ్చని సంకేతాలు ఇచ్చేలా రజనీకాంత్ చేసిన హడావిడి జనాలు ఇంకా మరువక ముందు, మరో అగ్ర సినీ నటుడు కమల్ హాసన్ ట్వీట్ల వర్షం కురిపిస్తూ తనదైన శైలిలో రాజకీయ సంకేతాలు పంపుతున్నాడు.
 
కమల్ హాసన్ హోస్ట్‌గా నిర్వహించబడుతున్న బిగ్‌బాస్ షో దుమారం ఇంకా సమసిపోకముందే, నిన్న రాత్రి 'నేను చీఫ్ మినిస్టర్‌ని' అంటూ తను చేసిన ట్వీట్లు తమిళ తంబీల మదిలో అనేక ప్రశ్నలు కలిగిస్తున్నాయి. తన ట్విట్టర్‌లో ముందుగా 'కొద్దిసేపట్లో ఒక ప్రకటన చేయబోతున్నాను' అని ముందస్తు సూచనలాంటి ట్వీట్ చేశాడు. 
 
ఆ తర్వాత, 'నన్ను ఓడిస్తే... క్రింద పడిన కెరటంలా మళ్లీ పైకి లేస్తాను. నేను అనుకున్నానంటే ముఖ్యమంత్రినే కాగలను... అన్యాయాలను ఎదిరించేవాడే నాయకుడు' అని చెప్పుకొచ్చాడు. ఈ విషయం ప్రకటించడానికి కమల్‌ సరదాగా ఇలా ట్వీట్లు పెట్టి కాసేపు అభిమానులను ఆటపట్టించారట.

వెబ్దునియా పై చదవండి