మెగాస్టార్ చిరంజీవిపై తమిళ సీనియర్ నటుడు రాజ్‌కిరణ్ సంచలన ఆరోపణలు చేశారు. చిరంజీవి ఓ మోసగాడని, ఆయన తనకు అన్యాయం చేశారంటూ వాపోయారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో సంచలనంగా మారాయి. అసలు చిరంజీవిపై తమిళ హీరో ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా?
మూడేళ్ల క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఆ సినిమా వివాదమే ఇప్పుడు రాజ్‌కిరణ్ తెరపైకి తెచ్చాడు. వాస్తవానికి ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్ పాత్రలో ముందుగా రాజ్‌కిరణ్‌ను తీసుకున్నారు. కానీ, 60 శాతం సినిమా షూటింగ్ పూర్తైపోయినా.. ఉన్నట్టుండి రాజ్‌కిరణ్‌ను తప్పించేసి ప్రకాశ్‌రాజ్‌ను తీసుకున్నారు. ఇదే అసలు కోపానికి ప్రధాన కారణం.
దీనిపై రాజ్‌కిరణ్ స్పందిస్తూ.. 60 శాతం షూటింగ్ పూర్తయిన రషెస్‌ను చూసిన చిరంజీవి... ఈ సినిమాలో హీరో రాజ్‌కిరణా? రామ్‌చరణా? అని అడిగినట్టు తెలిసింది. నా పాత్రకు ప్రాధాన్యం ఎక్కువ కావడంతో ఈ చిత్రం నుంచి నన్ను తప్పించారు. ఆ పాత్రకు కొన్ని మార్పులు చేసి ప్రకాష్ రాజ్‌ను తీసుకున్నారు. నన్ను తప్పించడంపై ప్రకాష్ రాజ్ అడిగితే.. నాకు మొత్తం సెటిల్ చేసినట్టు చెప్పారు.
కానీ, సినిమాకు సంబంధించి నాకు ఇంకా రూ.10 లక్షలు రావాలి. అప్పట్లో వర్షాల వల్ల హైదరాబాద్‌లో జరగాల్సిన షూటింగ్ ఆగిపోయింది. షూటింగ్ మొదలయ్యాక చెబుతామన్నారు. కానీ, డైరెక్టర్‌గానీ, హీరోగానీ, నిర్మాతగానీ ఆ తర్వాత నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఓ నటుడి పట్ల ఇలాగేనా వ్యవహరించేది? వాళ్లకు ఎలాంటి ఇబ్బందులున్నా నాకు సమాచారం ఇవ్వాల్సింది’’ అంటూ రాజ్‌కిరణ్ వాపోయారు.